ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదిరి నెల రోజులు దాటేసింది. కూటమిలో మూడు పార్టీల నుంచి పోటీ చేసిన వారిలో 11 మంది మినహా అందరూ ఘనవిజయం సాధించారు. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వంలో మొత్తం 25 మందికి మంత్రులుగా అవకాశం ఉంది. జనసేన నుంచి ముగ్గురికి బీజేపీ నుంచి ఒకరికి అవకాశం రాగా.. తెలుగుదేశం నుంచి 20 మంది మంత్రులు అయ్యారు. బాబు క్యాబినెట్లో ఒక మంత్రికి మాత్రం అవకాశం ఉంది. ఈ మంత్రి పదవి చంద్రబాబు ఎవరికి ఇస్తారు..? అన్నదానిపై ఎవరి ఆశలలో వారు మునిగి తేలుతున్నారు. ఈసారి చాలా సామాజిక వర్గాలకు చంద్రబాబు క్యాబినెట్లో అవకాశం దక్కలేదు.


అయితే కాపు సామాజికవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఇద్దరికి మాత్రమే మంత్రి పదవి దక్కింది. నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ మాత్రమే టీడీపీ నుంచి కాపుకోటలో మంత్రులు అయ్యారు. జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కందుల‌ దుర్గేష్ మంత్రి అయ్యారు. ఈ క్రమంలోనే ఆ క్యాబినెట్ బెర్త్‌ కోసం టీడీపీలో కాపు నేతల మధ్య తీవ్రంగా పోటీ కనిపిస్తోంది. టీడీపీ నుంచి వరుసగా ఓటమి లేకుండా గెలుస్తూ వస్తున్న మాజీ మంత్రి.. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లా కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే గంటాకు శిష్యుడు ఆయన జనసేన ఎమ్మెల్యే.. పెందుర్తి నుంచి గెలిచిన పంచకర్ల రమేష్ బాబు సైతం తాను కూడా మంత్రి పదవి రేసులో ఉన్నానని చెబుతున్నారు.


గంటా శిష్యులుగా రాజకీయాల్లోకి వచ్చిన వారిలో అవంతి శ్రీనివాస్.. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. గంటా కూడా మంత్రి అయ్యారు. ఇప్పుడు తనకు కూడా ఆ అవకాశం వస్తుందని పంచకర్ల రమేష్ బాబు ఆశలు పెట్టుకున్నారు. ఇక విశాఖపట్నం జిల్లా నుంచి గంటా.. పంచకర్ల రమేష్ బాబు క్యాబినెట్ బెర్త్‌ కోసం కాపు కోటాలో రేసులో ఉంటే.. గుంటూరు జిల్లా నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సైతం తనకు కాపు కోటాలో కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఆయన కూడా సీనియర్ నేత కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లి తిరిగి టీడీపీలోకి వచ్చి ఆయన సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి చంద్రబాబు వీరిలో ఒక్క‌రికి అయినా కేబినెట్ బెర్త్‌ ఇస్తారా..? లేదా..? అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: