గత పదేళ్లుగా బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య ఉన్న బంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మేము మిత్ర పక్షమే అని స్వయంగా కేసీఆరే ప్రకటించారు. దీనిపై బీజేపీ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎదురుదాడి చేశారే తప్ప వెనక్కి తగ్గలేదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత వీరి బంధానికి బీటలు బారినట్లు కనిపిస్తోంది. బీజేపీతో జరుపుతున్న చర్చల సారాంశం ఏంటో చెప్పాలని అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ డిమాండ్ చేశారు.
బీజేపీలో విలీనం అవుతున్నారా లేకపోతే పొత్తులు పెట్టుకుంటున్నారా చెప్పాలన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ చర్చలు జరుగుతున్నాయన్నట్లుగా చేసిన ప్రకటనపై స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగితే బీజేపీ బలపడుతుంది అని తాను ముందు నుంచి చెబుతున్నానని.. అప్పట్లో కాంగ్రెస్ నియమించిన ప్రణబ్ కమిటీకి కూడా చెప్పానన్నారు. ఇప్పుడు అదే జరుగుతుందన్నారు. ఇప్పటికే ఒవైసీ కేసీఆర్ ను వదిలించేసుకున్నారు. పదవిలో ఉన్నంత కాలం మామూ కేసీఆర్ అంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కే మా మద్దతు అంటూ ప్రకటనలు చేశారు.
ఓవైసీ విధానం ఎప్పుడూ ఒక్కటే. ఆ పార్టీకి మ్యానిఫెస్టో ఉండదు. అధికారంలో ఉన్నవారే మిత్రపక్షం. వాళ్లు కలుపుకోవడమే ఆలస్యం. రేవంత్ రెడ్డి ప్రస్తుతం స్నేహ హస్తం చాచారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఓవైసీ సోదరులను ఒక ఆట ఆడుకున్నారు. కానీ ప్రస్తుతం పాత బస్తీలో ఎంఐఎం బలం పెరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు కూడా అవసరమే. ఈ నేపథ్యంలో ఓవైసీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.