ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని వైసిపి అధినేత జగన్ ఎన్నో కలలు కన్నారు. ఐదేళ్లపాటు తాను చేసిన సంక్షేమం తనను మరోసారి అధికారంలోకి తీసుకువస్తుందని జగన్ బలంగా నమ్మారు. అందుకే క్షేత్రస్థాయిలో అభివృద్ధి లేకపోయినా జగన్ పట్టించుకోలేదు.. తాను ప్రతి ఇంటికి సంక్షేమాన్ని తీసుకువెళ్లాన‌ని.. నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేశానని జగన్ బలంగా నమ్మారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఓటరు జగన్ అనుకున్న దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ఇది వైసీపీ చరిత్రలోనే క‌నీవినీ ఎరుగని ఘోర పరా జ‌యం అని చెప్పాలి.


ఇక జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలోను ఆ పార్టీ నూటికి నూరు శాతం విజయాలు సాధించింది. అన్ని కార్పొరేషన్లు వైసిపి ఖాతాలోనే పడ్డాయి. అయితే ఇప్పుడు వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో స్థానిక సంస్థలకు చెందిన వైసిపి ప్రజాప్రతినిధులు .. వైసిపి మేయర్లు .. డిప్యూటీ మేయర్లు .. మున్సిపల్ చైర్మన్లు .. ఎంపీపీలు.. జడ్పిటిసిలు ...  సర్పంచ్లు కూటమి పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన విశాఖ నగరపాలక సంస్థను చేజిక్కించుకోవడానికి ఇప్పుడు కూటమి ప్ర‌భుత్వం పావులు కలుపుతోంది.


వాస్తవానికి ఎన్నికలు జరిగినప్పుడే విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలలో తెలుగుదేశం - జనసేన గట్టి పోటీ ఇచ్చాయి. మిగిలిన నగరాల కంటే విశాఖలో టిడిపి - జనసేన రెండు సత్తా చాటాయి. ఇక విశాఖ నుంచి వైసీపీ తరఫున మేయర్గా హరికుమార్ కి పదవి కట్టబెట్టారు జగన్. ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు గోడ దూకుతున్నారు. ఎన్నికలకు ముందు కొంతమంది కార్పొరేటర్లు కండువాలు మార్చేశారు. ఇప్పుడు వైసీపీకి చెందిన 20 మంది కార్పొరేటర్లు టిడిపి , జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు.


ఈ విషయం బయటకు పోకడంతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. కూటమీ పార్టీలలోకి వెళ్ళవద్దని కార్పొరేటర్ లను ఆయన వేడుకున్నా వారు అమర్నాథ్ మాటలు అస్సలు పట్టించుకోలేదు. పార్టీలో అసలు తమకు విలువ లేదని .. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తమను ఎవరూ పట్టించుకోలేదని .. ఇప్పుడు మీ మాట వినే ప్రసక్తి లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: