జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌మాదంలో ఉన్నారా? ఆయ‌న‌కు ఎప్పుడై నా ఏమైనా జ‌రిగే అవ‌కాశం ఉందా? ఇదీ ఇప్పుడు రాజ‌కీయంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. తాజాగా కేంద్ర నిఘా వ‌ర్గాలు రాష్ట్రానికి స‌మాచారం అందించిన‌ట్టు తెలియ‌డంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు హాని త‌ల‌పెట్టే వారు ఎవ‌రు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. నిజానికి ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న త‌ర్వాత‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ కార్యాల‌యం.. లేదా ప్ర‌భుత్వ కార్యాల‌యాల వ‌ర‌కే ప‌రిమితం అవుతున్నారు.


అయితే.. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌స్తే.. ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తాజాగా కేంద్ర నిఘా వ‌ర్గాల నుంచి స‌మాచారం అందడం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. కొన్ని సోష‌ల్ మీడియా గ్రూపుల్లో ప‌వ‌న్‌పై వ్య‌తిరేక వార్త‌లు వ‌స్తున్నాయ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ప‌రిస్థితి నివురుగ‌ప్పిన నిప్పుగా ఉంద‌ని హెచ్చ‌రించ‌డం విశేషం. అయితే.. అస‌లు అంత ప్ర‌మాదం చోటు చేసుకునే అవ‌కాశం ప‌వ‌న్‌కు ఎక్క‌డుంది?  విష‌యం ఏంటి? అనేది చూస్తే..  


ప్ర‌స్తుతం రాష్ట్రంలో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని వైసీపీ  నాయ‌కులు ఆరోపిస్తున్నారు. హ‌త్య‌లు జ‌రుగుతున్నా.. ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న ప‌వ‌న్ స్పందించ‌డం లేద‌ని చెబుతున్నారు. దీనిపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదేమ‌న్నా.. ప‌వ‌న్‌కు ముప్పు త‌ల‌పెట్టే ప్ర‌మాదం ఉందా? అనే చ‌ర్చ సాగుతోంది. మ‌రో వైపు.. తూర్పుగోదావ‌రి జిల్లాలో బియ్యం అక్ర‌మ ర‌వాణాపై జ‌న‌సేన దూకుడుగా ఉంది. వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిని టార్గెట్ చేసిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.


ద్వారంపూడి చేస్తున్న బియ్యం వ్యాపారంపై జ‌న‌సేన నాయ‌కుడు, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కొన్నాళ్లు స‌మీక్ష‌లు చేశారు. అదేవిధంగా.. తాజాగా ద్వారంపూడికి చెందిన రొయ్య‌ల ఫ్యాక్ట‌రీ కార‌ణంగా.. ప‌ర్యావ‌రణం క‌లుషితం అవుతోంద‌ని.. ఆ ఫ్యాక్ట‌రీని మూయించాల‌ని కూడా భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే పవ‌న్‌కు హాని ఉంద‌ని కేంద్ర నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించాయా? అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. ఈ క్ర‌మంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు?  కేంద్రం నుంచి హెచ్చ‌రిక‌లు వ‌చ్చే వ‌ర‌కు వారు ప‌సిగ‌ట్ట‌లేక‌పోయారా? అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. హాని క‌లిగించే స్థాయిలో ప‌వ‌న్‌కు ఇబ్బందులు అయితే లేవ‌నేది పార్టీ నాయ‌కులు చెబుతున్న మాట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: