ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టుల్లో ఎంపికలో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ ప్రశ్నించారు. ఆదివారం ఆమె తన ఎక్స్‌ ఖాతా ద్వారా ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సివిల్ సర్వీసుల్లో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎక్కువ గంటలు పనిచేయాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోస్టుల్లో దివ్యాంగ కోటా ఎందుకు అని ఆమె ప్రశ్నించారు.


సివిల్స్ సర్వీస్ ఉద్యోగాలకు ఎంపిక చేసే విషయంలో అనుసరిస్తున్న విధానాలపై కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అంగ వైకల్యం ఉందంటూ నకిలీ సర్టిఫికెట్ సమర్పించి సివిల్ సర్వీసులో ప్రవేశించారని పూజా ఖేడ్కర్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆదివారం స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఓ వైకల్యం కలిగిన సర్జన్ తో మీరు ఆపరేషన్ చేయించుకుంటారా.. వైకల్యం ఉన్న ఫెలెట్ ను విమానయాన సంస్థలు నియమించుకుంటాయా అంటూ ఆమె ప్రశ్నించారు.


ఆమె వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  దివ్యాంగ రిజర్వేషన్లపై ఆమె చేసిన వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మరో సివిల్  సర్వెంట్, సివిల్స్ పోటీ పరీక్షల శిక్షకురాలు బాలాలత డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు. ఏ అధికారంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.  ప్రత్యేక చట్టం ద్వారా అమల్లోకి వచ్చిన ఈ కోటాపై ఉన్నత పదవుల్లో ఉన్న ఓక అధికారి ఈ విధంగా వ్యాఖ్యానించడం సరి కాదన్నారు.


ఆమె వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బాలాలత ప్రకటించారు. ఇలాంటి వ్యాఖ్యల పట్ల దివ్యాంగుల పట్ల చిన్నచూపు ఏర్పడే అవకాశం ఉందన్నారు. వెంటనే తన వ్యాఖ్యలని ఉపసంహరించుకొని.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో స్పందించి.. మరెవరూ ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: