నల్ల కండువాతో అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో హింస పెరిగిపోయి ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని నిరసన వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలపై సభలో చర్చకు పట్టుబడతామని తెలిపారు. శాంతి భద్రతల అంశంలో అవసరమైతే గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకుంటామని వైసీపీ నేతలు చెప్పారు.

ఇక ఈ తరుణంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతిలో ప్లకార్డులు, పేపర్లు లాక్కునే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే.. పోలీసుల తీరుపై జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్.  ఆ అధికారం ఎవరిచ్చారంటూ.. గట్టిగా పోలీసులను నిలదీశారు జగన్‌. పోలీసుల ఝులుం ఎల్లకాలం సాగబోదని హెచ్చరించారు జగన్‌.

పోలీసులు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరికలు కూడా ఇచ్చారు. పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కానీ, యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కుని, చింపే అధికారం ఎవరిచ్చారని గట్టిగా నిలదీశారు జగన్‌. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు.

అటు తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన గవర్నర్ అబ్దుల్ నజీర్....ఏపీకి విభజన నష్టాలకంటే ఎక్కువ నష్టం గత ప్రభుత్వ విధానాల వల్ల జరిగిందని తెలిపారు. ప్రజా వేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం విధ్వంసకర విధానాన్ని ప్రారంభించిందని... గత పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. ఏపీలో రాజ్యాంగకరమైన విచ్ఛిన్నం జరిగిందా అనే అంశంపై న్యాయ విచారణ చేపట్టాలని హైకోర్టు కోరిందని తెలిపారు గవర్నర్ అబ్దుల్ నజీర్.

మరింత సమాచారం తెలుసుకోండి: