ఇటీవల ఎన్నికల్లో వైస్సార్సీపీ ఘోర ఓటమి తరువాత మాజీ సీఎం జగన్ కేవలం బెంగుళూరులో ఉన్న యెహలంక పేలస్ కి మాత్రమే పరిమిత అయ్యారు. అయితే తాజాగా పల్నాడులో జరిగిన మర్డర్ తరువాతనే ఆంధ్రలోకి అడుగే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ కూటమిపైన విరుచుకు పడుతున్న సంగతి విదితమే. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఆంధ్రా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో ఆయన గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు నల్లకండువాలు కప్పుకుని అసెంబ్లీ ఆవరణలో నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది.

ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. నిరసనలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 'సేవ్‌ డెమోక్రసీ' నినాదాలు చేస్తూ అసెంబ్లీ హాలులోకి వెళ్లేందుకు స్పీడుగా ముందుకి కదలడంతో పోలీసులు అడ్డుకున్నారు. అదేవిధంగా పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేలను ప్లకార్డులు ప్రదర్శించ వద్దంటూ గేటు వద్దే నిలిపి వేశారు. అక్కడితో ఆగకుండా కాస్త దూకుడు ప్రదర్శించిన ఎమ్మెల్యేల వద్ద ఉన్న ప్లకార్డులు లాక్కొని పోలీసులు వాటిని చించేశారు. దీంతో మాజీ సీఎం జగన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోస్టర్లు గుంజుకుని మరీ చించేసే హక్కు మీకు ఎవరిచ్చారని మండిపడ్డారు. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదని, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

దీంతో గేటు వద్ద చాలా సేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని.. పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా ఉందని మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రంలో నియంత పరిపాలన కొనసాగిస్తున్నాడని, ఇకనైనా ప్రతీకార రాజకీయాలు మాని, రాష్ట్రం కోసం అలోచించి పనిచేయాలని మండిపడ్డారు. ఇక నిన్నటి వరకు అన్యాయాన్ని ప్రశ్నిస్తానన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన పరిస్థితులపైన ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.. ఆ తరువాత పోలీసులు అనుమతించడంతో వారందరు కూడా నల్లకండువాలతోనే అసెంబ్లీలోకి ప్రవేశించారు!

మరింత సమాచారం తెలుసుకోండి: