మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం పై ఇప్పుడు ఏపీ రాజకీయాలు హాట్‌ హాట్‌ గా కొనసాగుతున్నాయి. అయితే... ఈ ప్రమాదంపై వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ తరుణంలోనే... అన్నమయ్య జిల్లా రాయచోటిలో మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం పై స్పందించారు టిడిపి జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్ మోహన్ రాజు. టిడిపి జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్ మోహన్ రాజు షాకింగ్‌ కామెంట్స్ చేశారు.


మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల దగ్ధం వెనుక వైసిపి నేతల హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం భూ దందాలకు పాల్పడిందని పేర్కొన్నారు. వారి అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చే సమయంలో రికార్డులు దగ్ధం చేయడం అనుమానాలకు తావిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఐఏఎస్ అధికారిని సబ్ కలెక్టర్ గా నియమించడంతోనే దుండగులు ఈ దురాగతానికీ పాల్పడ్డారన్నారు.


రికార్డులు దగ్ధం కావడానికి కారకులైన వారి పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. వైసిపి నేతల భూ అక్రమాలను వెలికి తీసి గత ప్రభుత్వ పాలకుల అక్రమాలను ప్రజా కోర్టు ముందు ఉంచుతామని వార్నింగ్‌ ఇచ్చారు. కీలకమైన తపాలా విభాగం, 22(A) విభాగంలో రికార్డులు కాలి బూడిద అయ్యాయని పేర్కొన్నారు. 22(A) విభాగంలో గౌతమ్ తేజ్ అనే అధికారి రాత్రి 11 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నారన్నారు.


గత ప్రభుత్వంలో ఈయనపైన అనేక ఆరోపణలు ఉన్నాయి.. కాబట్టే ఉద్దేశ్య పూర్వకంగా అగ్నిప్రమాదం జరిగిందనే అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు. ఐదేళ్ల కిందట నిర్మించిన కొత్త భవనంలో మంటలు ఎలా వ్యాపించాయని ప్రశ్నించారు. గత వైసిపి ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాల వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు. ఘటన జరిగిన వెంటనే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారని... సీఎం ఆదేశాల మేరకు డిజిపి ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్  ప్రత్యేక హెలికాప్టర్ లో మదనపల్లికి రావడం జరుగుతుందన్నారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బహిర్గతం చేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: