
మాజీ సీఎం జగన్ గ్రూప్ తగాదాలకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలను చెబుతూ కుట్రలకు తెర లేపుతున్నారని పవన్ అన్నారు. జగన్ సభలోకి రావడానికి ముందే పోలీసులతో గొడవ పడటంతో పాటు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనమని వెల్లడించారు. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతామనే భ్రమ నుంచి జగన్ ను ప్రజలు బయట పడేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
జగన్ ఇంకా తనే సీఎం అని ఫీలవుతున్నారేమో అంటూ పవన్ కళ్యాణ్ ఒకింత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా జనసేన పార్టీ నూటికి నూరు శాతం సహకారం అందిస్తుందని పవన్ తెలిపారు. మరోవైపు లోకేశ్ సైతం జగన్ గురించి, జగన్ బిహేవియర్ గురించి స్పందించడం ద్వారా వార్తల్లో నిలిచారు.
జగన్ ఫేక్ రాజకీయం చేస్తున్నారని అయితే ఆ రాజకీయం పండటం లేదనే ఫ్రస్టేషన్ ఆయన ఫేస్ లో కనిపిస్తోందని లోకేశ్ వెల్లడించారు. ప్రభుత్వంలో మేము భయంతో ఉండటం కాదని ప్రజల పట్ల బాధ్యతగా ఉన్నామని లోకేశ్ పేర్కొన్నారు. జగన్ మాటల్లో, చేష్టల్లో అధికారం పోయిందనే బాధ కనిపిస్తోందని లోకేశ్ తెలిపారు. ఐదేళ్ల వైసీపీ విధ్వంసాన్ని కూటమి 50 రోజుల్లో తుడిచేయలేదని వైసీపీ విష ప్రచారం ప్రజామోదం పొందదని లోకేశ్ అన్నారు. పవన్, లోకేశ్ కామెంట్లు నెట్టింట చర్చనీయాంశం అయ్యాయి.