ఆంధ్రా రాజకీయాల్లో చంద్రగిరి నియోజకవర్గం చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకప్పుడు చంద్రగిరి నియోజకవర్గం నుండే ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి. ఒకప్పటి సంగతి పక్కన బెడితే ప్రస్తుతం మాత్రం చంద్రగిరి నియోజకవర్గం ఏపీలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలలో ఒకటిగా మారడం దురదృష్టకరం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ విషయం తేటతెల్లం అయింది. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సమయంలో అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల గురించి అందరికీ తెలిసిందే. కాగా ఇపుడు ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తోంది.

ఏపీ ఎన్నికల పోలింగ్ తరువాత అనగా మే 14వ తేదీ పద్మావతి మహిళా వర్శిటీ వద్ద టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై.. కొంతమంది దుండగలు దాడి చేసిన విషయం తెలిసినదే. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలే దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. ఈ దాడిలో గాయపడిన పులివర్తి నాని కొన్ని రోజుల పాటు వీల్‌ ఛైర్‌కే పరిమితం అయ్యారు. కాగా ఆ ఘటనలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పులివర్తి నానికి ఎలాంటి గాయాలు కాలేదని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తండ్రి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించడం కొసమెరుపు. ఇదే విషయమై ఇరువురు సోషల్ మీడియా వేదికగా ఫైటింగ్ షురూ చేసారు. స్విమ్స్ ఆస్పత్రి వైద్యులు చేసిన పరీక్షల్లో పులివర్తి నానికి ఎలాంటి గాయాలు కాలేదని తేలిందని చెవిరెడ్డి ఆరోపించగా చెవిరెడ్డి ఆరోపణలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు.

చెవిరెడ్డి మాటలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కౌంటర్ ఇస్తూ.. తాజా ఎన్నికల్లో ఓడిపోయేసరికి తండ్రీ కొడుకులు మతిస్థిమితం కోల్పోయి ఏదిపడితే అది మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. తమపై దాడులు కొత్తేమీ కాదన్న పులివర్తి నాని.. కొన్నేళ్లుగా తమపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా తనపై హత్యాయత్నం చేసిన మాట వాస్తవం కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాగా తనపై జరిగిన దాడికి సంబంధించిన అన్ని ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయన్న పులివర్తి నాని.. ప్రాథమిక విచారణలో మోహిత్ రెడ్డి ముద్దాయి అని తేలిందన్నారు. కాగా ఈ నేపథ్యంలోనే మోహిత్ రెడ్డి అరెస్టుకి రంగం సిద్ధం అయిందన్న వార్తలు మీడియాలో వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: