నేడు మారుతున్న దైనందిత జీవితాల్లో ఆన్లైన్ ఫుడ్ అనేది ఒక భాగం అయిపోయింది అనే నగ్న సత్యాన్ని ఎవ్వరూ కాదనలేరు. ముఖ్యంగా కోవిడ్ తరువాత దేశ యువత ఎక్కువగా ఆన్లైన్ ఫుడ్ కి బాగా అలవాటు పడ్డారని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో స్వీగ్గీ, జొమాటో వంటి ఫుడ్ సర్వీసింగ్ యాప్స్ కి మంచి గిరాకీ ఏర్పడింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు రోజులో కనీసం ఒక్కసారైనా ఈ ఫుడ్ ఆప్స్ నుంచి భోజనాలు తెప్పించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మనిషి భోజన శైలిపై పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కోవిడ్ ప్రవేశించాక ఒక్క హైదరాబాదులోనే సుమారు 74,807 రెస్టారెంట్లు కొలువుదీరాయి అంటే ఆలోచించండి. ఇక క్లౌడ్ కిచెన్లో కూడా నేడు గణనీయంగా పెరుగుతున్నాయి. కర్రీ పాయింట్స్ విషయానికి వస్తే.. ఇక చెప్పాల్సిన పనిలేదు. పట్టణాల్లో వీధికి ఒక కర్రీ పాయింట్ ఉంటుంది. ఇలా క్రమేపీ ఇంట్లో వండుకునే వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతుంది. దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఒక్క సంవత్సరానికి బిర్యానీ మార్కెట్ 20 వేల నుంచి 30 వేల కోట్ల వరకు ఉంది అంటే మీరు నమ్ముతారా? అంటే సుమారుగా సెకండ్ కి 2 నుంచి 3 బిర్యానీల ఆర్డర్లు ఆన్లైన్ ఫుడ్ యాప్స్ లో రావడం సర్వసాధారణం అయిపోయింది.

ఇలా రోడ్డు మీద పెట్టే పానీపూరి దగ్గర నుంచి రెస్టారెంట్లో సర్వ్ చేసే బిర్యానీ వరకు అన్నిటికీ ఇపుడు డిమాండ్ ఎక్కువగా వుంది. ఇవి చూడడానికి ఎంతో అందంగా ఉండి, తినడానికి మరింత రుచిగా ఉంటాయి. కాబట్టి మరీ ముఖ్యంగా యువతీయువకులు తమ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా వీటిని బాగానే ఆరగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య నిపుణులు ఆన్లైన్ ఫుడ్ పైన కొన్ని సూచనలు చేస్తున్నారు. ఈ విషయాలు ముఖ్యంగా యువత కోసమే. రోజు ఇలా బయట ఫుడ్డు తినడం వల్ల ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందనే విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో భావితరాలు భద్రంగా ఉండాలి అంటే.. మనం తీసుకునే ఆహారంపై ఖచ్చితంగా అవగాహన ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బేసిగ్గా ఇంట్లో చేసుకొనే వంట అనేది చాలావరకు తాజాగా ఉండేలా చూసుకుంటాం.. అదే బయట ఫుడ్ విషయంలో ఈ గ్యారంటీ అనేది ఉండదు. తద్వారా ఉదర, కాలేయ సంబంధిత వ్యాధులకు ఆస్కారముందని చెబుతున్నారు వైద్యులు. కాబట్టి వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయడమే మంచిదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: