రాష్ట్రంలో రాజకీయాలు మరింతగా వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వపరంగా ఏమాత్రం ఆలోచనత్మక ధోరణితో ముందుకు సాగలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధాన ఉదాహరణ సోమవారం జరిగిన అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం. నిజానికి అసెంబ్లీ సమావేశాల సమయంలో బీఏసీ నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ కార్యక్రమానికి అసెంబ్లీలో ఉన్న అన్ని పార్టీలను పిలుస్తారు. ఆయా పార్టీల నుంచి ఫ్లోర్ లీడర్లు ఈ కార్యక్రమానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు.


అయితే తాజాగా జరిగిన బిఎసి సమావేశానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పిలవకపోవడం ఆ పార్టీ నుంచి ఎవరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పిలవకూడదని నియమం ఎక్కడా లేదు. కానీ ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వస్తే కాదనలేం అలాగని పిలవలేం అన్నట్టుగా వ్యవహరించడంతో బీఏసీ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరుకాకుండా దూరంగా ఉంది.


తద్వారా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయి ఏ అంశాలు చర్చించాలి ఏ ఏ అంశాలపై సభ దృష్టి పెట్టాలి అనే విషయాలను కేవలం కూటమి పార్టీలో ఉన్న నాయకులు మాత్రమే చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యహిత రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి సంక్లిష్ట‌ రాజకీయాలు నడుస్తున్న రాష్ట్రంలో సరికాదని అభిప్రాయం ఉంది. అయినా ఎవరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోవడం వైసీపీని పిలవాలి అన్న ఆలోచన ప్రభుత్వ వర్గాలకు లేకపోవడం వైసీపీ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడం చూస్తే రానున్న రోజుల్లో అసలు అసెంబ్లీ ఏకపక్షంగా జరిగిన ఆశ్చర్యం లేదనిపిస్తోంది.


వ్యక్తిగత రాజకీయ వ్యవహాలు, వ్యక్తిగత పాలనా వ్యూహాలకు మాత్రమే అసెంబ్లీ ఇకపై పరిమితం కానుంది అనే చర్చ జోరుగా సాగుతోంది. కానీ వాస్తవానికి ప్రజా కోణంలో చూసినప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న ప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బిఎసి సమావేశానికి కమ్యూనిస్టు పార్టీలను కూడా ఆహ్వానించా రు ఆ పరిస్థితి రాష్ట్రంలో లేకపోవడం కీలకమైన బిఏసి సమావేశానికి వైసీపీని ఆహ్వానించకపోవడం ఆ పార్టీ కూడా జోక్యం చేసుకోకపోవడం అంటివి దారుణమనే చెప్పాలి. ముందు ముందు ఇదే పరిస్థితి కొనసాగితే అసెంబ్లీ సమావేశాలు కేవలం కూటమి ప్రభుత్వానికి మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: