ఏపీ గ‌వర్నర్ అబ్దుల్ న‌జీర్ సోమ‌వారం చేసిన బడ్జెట్ ప్రసంగంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ఇది పాజిటివ్ చర్చ అయితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. కానీ గవర్నర్ చేసిన ప్రసంగంలో వెల్లడించిన అంశాలు నిజానికి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో ఆ అంశాలను ఇప్పుడు కూడా ప్రస్తావించారు. ఇది తప్పు కాదు. కానీ గవర్నర్‌గా ఇలాంటి అంశాలను చదివేటప్పుడు ముందుగా కొన్ని లెక్కలు వేసుకొని వ్యవహరించి ఉంటే బాగుండేదని పరిశీలకుల మాట‌.


ప్రస్తుతం గవర్నర్ చేసిన ప్రసంగంలో కీలక అంశాలను పరిశీలిస్తే.. గత ఐదు సంవత్సరాలు రాష్ట్రం నష్టపోయిందని గవర్నర్ స్వయంగా చెప్పారు. ప్రజావేదిక కూల్చేశారని, నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్మారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులు దోచుకునే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా అమరావతిని నాశనం చేసి మూడు రాజధానులు అంటూ ప్రజల మభ్య పెట్టారని కూడా అన్నారు.  అలాగే విశాఖలో రిషికొండను తొలిచేసి పర్యావరణానికి భంగం కలిగిస్తూ అక్కడ ప్యాలెస్ కట్టారని గవర్నర్ చెప్పుకొచ్చారు.


భారీగా అప్పులు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని తద్వారా రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి దిజారిపోయిందని గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం కోణాల్లో చూసినప్పుడు ఇది ముమ్మాటికి తప్పు కాదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు మాత్రమే. గత ప్రభుత్వాన్ని విమర్శించాలి అనేది లేదా గత ప్రభుత్వం చేసిన తప్పులను అసెంబ్లీలో  చెప్పాలి అనేది ఆ ప్రభుత్వం ల‌క్ష్యంగా పెట్టుకోవ‌డంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఏ గవర్నర్ అయితే గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి అని చదివారో..  గత ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపించారో.. అదే గ‌వ‌ర్న‌ర్‌.. గడిచిన రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆమోదించిన విషయం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువస్తూ ప్రభుత్వం చేసినటువంటి చట్టానికి గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ సంతకం పెట్టారు.


అదేవిధంగా రాష్ట్రంలో నాశరకం మద్యం విక్రయాలు జరుగుతున్నాయని దీనివల్ల ప్రభుత్వం దోచుకుంటుందని అనేక సందర్భాల్లో టిడిపి నాయకులు అలాగే జనసేన నాయకుడు కూడా ఆయనను కలిసి మొరపెట్టుకున్నారు. కానీ అప్పుడు మౌనంగా చూస్తూ కూర్చున్న  గవర్నర్ ఇప్పుడు ఆ విధానాన్ని తప్పు బట్టి ప్రసంగించారు. అలాగే ఋషికొండపై జరుగుతున్న  నిర్మాణాల విషయంలో హైకోర్టు సీరియస్ గా స్పందించింది. పర్యావరణానికి వ్య‌తిరేకంగా నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని  చెప్పింది.


అప్పుడు గవర్నర్ గా ఉన్నది కూడా అబ్దుల్ న‌జీర్‌. మరి ఇప్పుడు ఆయా అంశాలను దారుణమని దుర్మార్గమని చెప్పడం ద్వారా సహజంగా ఒక గవర్నర్‌గా గత పాలనను అంటే తన పేరుతో జరిగినటువంటి పాలన‌ను తనే విమర్శించుకునే పరిస్థితి ఈరోజు గవర్నర్ కి ఏర్పడింది. ఇలాంటి సందర్భాల్లో గవర్నర్‌గా ఏం చేయాలి? అనేది ఒక ప్రశ్న. సాధారణంగా ప్రభుత్వాలు మారిన  నేప‌థ్యంలో గవర్నర్ మారకపోవచ్చు. అలాంటి సమయంలో తన పేరుతో జరిగినటువంటి పాలన కాబట్టి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నవి ఆమోదయోగ్యంగా లేనివి అనేది గుర్తించి వాటిని పరిశీలించి ఉండాలి.


ఏది మంచి.. ఏది చెడు అనేది గవర్నర్ నిర్ణయించుకుని ప్రసంగించేవారు. ఒకప్పుడు ఆ సంస్కృతి ఉండేది. ప్రసంగపాఠాన్ని ముందుగానే గవర్నర్ కార్యాలయానికి పంపించటం ప్రభుత్వం ప్రధాన విధి. రాను రాను ఈ పరిస్థితి మారిపోయింది. గవర్నర్ అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూడా ప్రసంగంలో మార్పులు జరుగుతున్నాయి. గతంలో తెలంగాణలో ఇదే జరిగింది. దీనిని అప్పటి గ‌వ‌ర్న‌ర్‌ ప్రశ్నిస్తే అసలు ప్రసంగమే లేకుండా తదుపరి స‌భ‌లు నడిచిపోయాయి. కాబట్టి ఇప్పుడు జరిగిన  సమావేశంలో కూడా గవర్నర్  గతంలో ఉన్న తన పాలనపై త‌నే  విమర్శించే పరిస్థితి ఏర్పడడం  గ‌మ‌నార్హం.


గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తెలిసికూడా ఇప్పుడు వాటిని తప్పు పట్టడం అనేది ప్రసంగానికి వ‌న్నె అయితే తీసుకురాలేదు. కూటమి ప్రభుత్వంపరంగా చేయాల్సిన ప్రయత్నం చేసినా.. గవర్నర్ పరంగా ఆయన ఈ ప్రసంగంలో మార్పులు చేర్పులు చేసి తన పాలనకు తనే తప్పులు వెతికే పరిస్థితి లేకుండా వ్యవహరించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: