ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. బుధ‌వారం రాష్ట్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు.  అయితే.. ఈ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తేలుస్తారా? అనేది ఆస‌క్తిగామారింది. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పాల‌న‌పై అనేక విమర్శలు చేశారు. వాటిలో ప్రధానంగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని, రాష్ట్రం రావణకాష్టంగా మారుతోందని, రాష్ట్రం శ్రీలంక అవుతోందని ఇలా అనేక విమర్శలు చేశారు.


దీనిలో ప్రధానంగా చెప్పుకొచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి హయాంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని. ఆ నిధుల‌ను దోచేశారని.. ప్రజలకు పది రూపాయలు ఇచ్చి ₹100 దోపిడీ చేశారని ఆరోపించారు. ఇదే వ్యవహారాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆవిడ చెప్తే చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి 14 లక్షల కోట్ల అప్పు చేసారు అని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. కాబట్టి అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది అసలు జగన్ ప్రభుత్వం ఎంత అప్పు చేసింది? అనే.


అదేవిధంగా ఏ మేరకు దోచేసింది అనేదే! ఈ విషయాన్ని వెల్లడించాల్సిన బాధ్యత, అవసరం చంద్ర బాబు ప్రభుత్వానికి ఏర్పడింది. ఎందుకంటే కేవలం నోటిమాటగా చెప్పడం కన్నా ఇప్పుడు అధికారికంగా చెప్పాల్సి వస్తే అది పూర్తిస్థాయిలో ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను నాలుగు లక్షల కోట్లు అని మాత్రమే పేర్కొనడం గ‌మ‌నార్హం. దీంతో అసలు జగన్ చేసిన అప్పులు ఎన్ని? అనేది తేలాల్సిఉంది.


మ‌రీముఖ్యంగా చంద్ర‌బాబు గ‌తంలో చెప్పిన‌ట్టు..  జగన్ ప్రభుత్వంలో జరిగిన లోపాలు ఏమిటి ఆర్థిక వ్యవస్థను ఎలా ఆయన భ్రష్టు పట్టించారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి దేనికి చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇస్తారు ఏం చేస్తారు అనేది చూడాలి. ఇప్పుడు క‌నుక చంద్ర‌బాబు ఈ విష‌యం నుంచి త‌ప్పించుకుంటే.. గ‌తంలో చేసిన ఆరోప‌ణ‌లకు వాల్యూ ఉండ‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి దీనిని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: