• నేడే ఏపీ బడ్జెట్ ఆవిష్కరణ
• ఆడబిడ్డ నిధి పథకానికి నిధులు సమకూరుస్తారా
• నెల నెలా రూ.1500 జమ అయ్యేది ఎప్పుడు
(ఏపీ - ఇండియాహెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయం ఆసన్నమైంది. నేడే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సిక్స్ గ్యారెంటీలు అమలు చేసే దిశగా ప్రకటనలు చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలు, రైతులకు లబ్ధి చేకూర్చడమే ఈ ఆరు గ్యారెంటీల లక్ష్యమని టీడీపీ నేతలు చెబుతూ వచ్చారు.
ఆడబిడ్డ నిధి పథకం కింద, 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు మంత్లీ రూ.1,500 అందజేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామన్నారు. అయితే ఇప్పటివరకు మహిళల కోసం ఇచ్చిన హామీలలో దేనిని అమలుపరచలేదు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెడతామని ఒక ప్రకటన చేశారు కానీ రూ.1,500 ఎప్పుడు అందిస్తామనేది ఇప్పటివరకైతే చెప్పనేలేదు.
నెల నెలా రూ.1500 ఇస్తామన్న హామీపై ఈసారి బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించనున్నారు అని ఏపీ ఆడబిడ్డలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం నుంచి అయితే రాజధాని అమరావతిని డెవలప్ చేసుకోవడానికి 15 వేల కోట్లను చంద్రబాబు అండ్ టీం పొందింది. ఇంకా ఏపీకి చాలానే ఆర్థిక సహాయాలు చేస్తామని నిర్మలా సీతారామన్ మాటిచ్చారు. అక్కడ బూస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను బాబు కచ్చితంగా అమలు చేస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి ఈ 1,500 రూపాయలు చెప్పినట్లు ఖాతాల్లో జమ చేస్తారో లేదో! అలా చేస్తే మాత్రం మహిళల్లో చాలా మంచి పేరు వస్తుంది ఈసారి వాళ్లు బాబును కచ్చితంగా గెలిపించే అవకాశం ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆడవాళ్లకు నెలకు రూ.2,500 సహాయం ఇస్తామని హామీ ఇచ్చింది. అర్హులైన కుటుంబాలకు రూ.500కి వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూడా అన్నారు కానీ ఏవీ నెరవేర్చలేదు. ఇప్పటికే దీని గురించి తెలంగాణ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు ఒకవేళ టీడీపీ ఇచ్చిన ఇలాంటి హామీలను నెరవేర్చతే బాబుకు చాలా గొప్ప పేరు వస్తుంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.