- మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌లో 1.50 ల‌క్ష‌ల కోట్లు చూపించిన వైసీపీ స‌ర్కార్‌
- ఏడు నెల‌ల‌కు రు. 3 ల‌క్ష‌ల కోట్లు త‌ప్ప‌నిస‌రి
- జ‌గ‌న్ నుంచి మించిన సంక్షేమ ప‌థ‌కాలు.. బాబు నెత్తిపై పెను భారం

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్ట‌నున్న ఏడు మాసాల బ‌డ్జెట్ సుమారు రూ.3 ల‌క్ష‌ల కోట్ల‌పైమాటేన‌ని ప్రభుత్వ వర్గాలు భావిస్తు న్నాయి. ముఖ్యంగా అమ్మకు వందనం, ఆడబిడ్డ నిధి, అదేవిధంగా నిరుద్యోగ భృతి వంటి వాటిని అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న  గణాంకాలను సమూలంగా మార్చడంపై పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు జ‌రిగింది. ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక  ఎన్నికలకు ముందు వైసీపీ ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన ఇంటీరియం(మ‌ధ్యంత‌ర) బడ్జెట్లో 1,50,000 కోట్ల రూపాయల పైబడి బ‌డ్జెట్‌ను చూపించారు. ఇప్పుడు ఏడు మాసాల కాలానికి దానికి రెండింతలు వ్యయం అయ్యే అవకాశం కనిపిస్తోంది.


పైగా కీలకమైన పథకాలను అమలు చేయాల్సి రావటం, వాటి  రెవెన్యూ వ్య‌యం పెరిగిపోవటంతో ఈ మేరకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే సమయంలో ప‌థ‌కాల‌కు కేటాయింపులు, రెవెన్యూ రాబ‌డి.. వంటివి ప్రభుత్వానికి పెను సవాలుగా మారుతోంది. ఇక‌, మూల ధ‌న వ్య‌యం.. అంటే ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం, అదేవిధంగా అమరావతి నిర్మాణం వంట‌వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్రం రూ.15 వేల కోట్లు ఇస్తామ‌ని చెప్పినా...వాటికి కొంత రాష్ట్ర వాటాలు పెర‌గాల్సి ఉంటుంది.


అదే సమయంలో సంక్షేమ పథకాలకు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని పరిగణన‌లోకి తీసుకుంటే బడ్జెట్ దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయ‌ల‌కు పైగానే ఉంటుందని అంచనా. మ‌రోవైపు.. ఇంత పెద్ద మొత్తంలో కేటాయింపులు చేయాల‌న్నా.. ప్ర‌క‌టించాల‌న్నా కూడా.. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెద్ద‌గా కనిపించడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని పన్నుల వసూళ్లను, రెవెన్యూ రాబ‌డిని పెంచుకునేందుకు ప్ర‌బుత్వం చర్య‌లు చేప‌ట్టింది.  సుమారు రూ.రెండు లక్షల కోట్ల పైబడి బడ్జెట్ ని ప్రవేశపెట్టిన జగన్ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది.


ఇక‌, ఇప్పుడు జగన్ ప్రభుత్వం కన్నా ఇంకా ఎక్కువగానే సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉన్న‌ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయకుండా ఎలా ముందుకు సాగుతుంద‌నేది చూడాలి. అలాగ‌ని రెవెన్యూ రాబ‌డి పెరిగే  విధంగా చర్యలు తీసుకునేలా అడుగులు వేయాల్సి ఉంటుంది. అయితే.. రెవెన్యూ రాబ‌డి పెర‌గేందుకు.. స‌మ‌యం ప‌ట్ట‌నుంది. రియ‌ల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటే.. అప్పుడు రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ పుంజుకుని.. ఆ త‌ర్వాత రెవెన్యూ రాబ‌డి పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర బ‌డ్జెట్  స్వ‌రూపం ఏమేర‌కు ఉంటుంది? ఎలాంటి వాటికి ప్రాధాన్యం ఉంటుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: