- గ‌త ప్ర‌భుత్వంలో ఇసుక‌కు యేడాదికి రు. 7 వేల కోట్లు.. ఇప్పుడ‌ది జీరో
- సంక్షేమం కోసం ఈ సారి ఓట్ ఆన్ అక్కౌంట్ త‌ప్ప‌దా..!

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎలా ఉంటే బాగుంటుంది? ఎలా ఉన్నా.. ప‌థ‌కాల‌కు పెద్ద‌పీట వేస్తారా?  లేక ప్రాజెక్టుల‌కు పెద్ద‌పీట వేస్తారా? అనేదిపెద్ద ప్ర‌శ్న‌గా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వచ్చే ఏడు మాసాలకు (ఆగ‌స్టు-మార్చి-2025) బడ్జెట్లో ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఎన్నికలకు ముందు అప్పటి వైసిపి ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీనికి ఈ నెల ఆఖరితో గడువు తీరుతుంది. దీంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి.. ఏమాసాల‌కు సంబంధించిన పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టవలసిన అవసరం ఏర్పడింది. వచ్చే ఏడు మాసాలకు సంబంధించి ప్రభుత్వం ఈ బడ్జెట్ పెడితే అది ఎలా ఉంటుంది?  అనేది ప్ర‌శ్న‌.


ప‌థ‌కాల‌కు ప్రాధాన్యం ఇస్తారా?  ప్రాజెక్టుల‌కు ప్రాధాన్యం ఉంటుందా? .. ప్రస్తుతం ఉన్న ఆదాయం ఎంత‌?  వ్య‌యం ఎంత? అనే లెక్కలు చూసుకుని బ‌డ్జెట్‌ను వండి వారుస్తారా? అనేది చూడాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులను గ‌మ‌నిస్తే.. రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా ఆదాయం కనిపించడం లేదు. గతంలో ఇసుక మీద ఏడాది 7 వేల కోట్ల రూపాయలు ఆదాయం వ‌చ్చేది. ఇప్పుడు ఇసుక ను ఉచితంగా ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం త‌గ్గిపోయింద‌నే చెప్పాలి. అదేవిధంగా ఇతర ఆదాయాన్ని చేసుకుంటే మధ్యం మీద వస్తున్న ఆదాయం మాత్ర‌మే ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నద‌ని చెబుతున్నారు.


రెవిన్యూ ఆదాయం వ‌చ్చేందుకు కూడా స‌మ‌యం ప‌డుతుంది. భూముల రిజిస్ట్రేషన్ జ‌రిగేందుకు కూడా స‌మ‌యం ప‌ట్ట‌నుంది. ఈ అంశాలను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ప్రభుత్వానికి ఇప్పుడున్న స‌మ‌యంలో వచ్చే ప్ర‌త్యేక‌ ఆదాయం కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు సంపద సృష్టిలో ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. బడ్జెట్లో ఇచ్చే కేటాయింపులు అయితే భారీగా ఉండే అవకాశం లేదు.  ఒకవేళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా.. వచ్చే ఏడు మాసాల కాలంలో అమలు చేయాల్సిన పథకాలను ప్రకటించాల్సి ఉంటుంది.


సంక్షేమ పథకాలను ప్ర‌క‌టిస్తార‌నేది సహజంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత ఒత్తిడి ఉంటుంది.
సంక్షేమ పథకాల అమలుపై.. అనేక‌ వర్గాల వారు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. దీనిని బడ్జెట్లో ప్ర‌క‌టించ‌క‌పోతే.. పరిస్థితి ఏమిట‌నేది ప్ర‌శ్న‌. ప్ర‌క‌టించ‌క‌పోతే.. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల ప‌రంగా ఆయా పథకాలకు కేటాయించే అవకాశం కనిపించడం లేదు. ఇదే విషయం ఇటీవ‌ల సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు.


ప్రస్తుతం ఖజానా ఖాళీగా ఉందని.. ఏం చేయాలన్నా డబ్బులు కనిపించడం లేదని.. చెప్పుకొచ్చారు. దీంతో ఈసారి కూడా ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌నే తీసుకువ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు. మరో రెండు నెలలు ఆగిన తర్వాత పూర్తిస్థాయి బ‌డ్జెట్‌నే ప్ర‌క‌టించ‌వ‌చ్చు. ఇలా  చూస్తే వచ్చే రెండు మాసాల కాలానికి ప్రభుత్వం పెద్దగా సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉండ‌దు క‌నుక‌.. కొంత మేర‌కు ప్ర‌భుత్వం న‌డిచిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: