- జ‌గ‌న్ ప్రారంభించిన నాడు - నేడు క్లోజ్‌..?
- విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో ఆగ్ర‌హం..
- ప్ర‌భుత్వాలు మారినా మంచి ప‌థ‌కాలు ఆపొద్ద‌ని వేడుకోలు

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాడు-నేడు పథకం దాదాపు ఆగిపోయింది. అప్ప‌ట్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలను కార్పొరేట్ స్థాయి పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నాడు నేడు పథకంలో కొన్నింటిని అలాగే తీర్చిదిద్దారు. కానీ మెజారిటీ పనులు మాత్రం చాలా జిల్లాల్లో జరుగుతున్నాయి., కొన్నిచోట్ల ఆగిపోయాయి. ఇంతలో ఎన్నికలు రావడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన దరిమిలా కూటమి ప్రభుత్వం రావడంతో ఈ పనులు పూర్తిగా నిలిచిపోయాయి.


వీటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన నిధులను కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా నాడు-నేడు పథకం కింద చేపట్టిన పనులు ఇప్పుడు అన్నిచోట్ల నిలిచిపోయి పాఠశాలల్లోకి నీరు రావడం పాఠశాలల్లో అభివృద్ధి పనులు మౌలిక సదుపాయాలు వంటివి నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పాఠశాల విద్యార్థులకు ఇచ్చే పుస్తకాలు, షూస్, డ్రెస్, బ్యాగులు వంటివి ఈ సంవత్సరం వరకు పంపిణీ చేశారు. అది కూడా ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసినవి కావడంతో వాటిని మూలన పడేస్తే చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వాటిని పంపిణీ చేసింది.


కానీ ఇప్పటికి శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాల్లో వాటిని కొనుగోలు చేయలేదు. దీంతో ఆయా జిల్లాల్లోని విద్యార్థులు సాధారణ దుస్తుల‌తోనే పాఠశాలలకు వస్తున్నారు. దీనిపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిడిపి ఎమ్మెల్యేలు అదేవిధంగా బిజెపి నాయకులకు తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కానీ, ఎవరు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం నాడు-నేడు కార్యక్రమాలు ఆగిపోవడంతో తల్లిదండ్రుల్లో మాత్రం ఒకింత ఆగ్రహం ఆవేదన కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ప్రభుత్వంపై ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.


ప్రభుత్వం ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని అమలు చేసినప్పుడు దాన్ని కొనసాగించడం తదుపరి వచ్చే ప్రభుత్వం బాధ్యత. దీన్ని చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాము చేపట్టిన అన్న క్యాంటీన్లను ఆపేశారని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడిన ఆయన.. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన నాడు-నేడు పథకాన్ని పూర్తిస్థాయిలో నిలిపివేసి అసలు ఆ కార్యక్రమం ఉందా? అని ఆలోచనలో ప‌డేసేలా చేయ‌డం గ‌మ‌నార్హం.


కనీసం రూపాయి నిధులు కూడా ఇవ్వకపోవడం.. నాడు నేడు పథకం కింద పనులు జరుగుతున్న పాఠశాలలను పట్టించుకోకపోవడం వంటివి ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తే అది చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి కూడా మేలు చేసినట్టు అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: