- జ‌గ‌న్ ఇచ్చిన ఈబీసీ చేనేత నేస్తం గాలికేనా..?
- లా స్టూడెంట్స్‌కు యేడాదికి రు. 60 వేల మాటేమిటి
- మంచి ప‌థ‌కాలు ఆపేస్తే ఎలా అని ప్ర‌భుత్వంపై ఎటాక్

( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )

రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో కొన్ని కీలక పథకాలు నిలిచిపోయాయి. వీటిలో ప్రధానంగా ఈ బీసీ నేస్తం, అదేవిధంగా లా నేస్తం ఉన్నాయి. ఈ రెండు పథకాలు నిజానికి ఆయా వర్గాలకు చాలా మేలు చేశాయని చెప్పాలి. గత ప్రభుత్వంలో తీసుకున్న‌ నిర్ణయాలను మేము ఎందుకు అమలు చేయాలని చంద్రబాబు భావించి ఉండొచ్చు. లేదా కూటమే ప్రభుత్వంలోని నాయకులు ఆలోచన చేసి ఉండొచ్చు. వాస్తవానికి ఈ బీసీ నేస్తం ద్వారా చేనేత మగ్గాలు కొనుక్కునేందుకు ఇతర వృత్తుల వారు వారి వారి ప‌నిముట్లను కొనుక్కునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏటా 18 వేల రూపాయలను వారికి అందించింది.


రాష్ట్ర ప్రభుత్వానికి భారమే అయినప్పటికీ వాటిని ఐదు సంవత్సరాలు కొనసాగించింది. కానీ ఇప్పుడు ఆ పథకాన్ని పూర్తిగా కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఇప్పుడు ఈబీసీ నేస్తం కోసం ల‌బ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. చంద్ర‌బాబు ప్రభుత్వం వ‌చ్చింద‌ని తెలిసినా.. ఈ ప‌థ‌కాన్ని నిలిపివేశార‌ని మాత్రం వారికి తెలియ‌దు. అదేవిధంగా లా చదివే విద్యార్థులకు  నెలకు 5000 రూపాయలు చొప్పున ఏటా 60 వేల రూపాయలు వారికి విడతల వారీగా అందించారు. తద్వారా అనేకమంది పేద కుటుంబాలకు చెందినవారు లా చదివేందుకు ముందుకు వచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి ఉన్న ఉపాధి కల్పన విషయంలో మెరుగైన ఫలితాలను సాధించింది.


దేశంలో ఎక్కడా అమలు చేయనటువంటి ఈ రెండు పథకాలను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేశారు. అయితే ఇప్పుడు ఈ రెండు పథకాలను కూడా కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. తద్వారా పథకాలపై ఆధారపడి లా చదువుతున్న వారు, అలాగే చేతివృత్తుల వారు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయాలను పథకాల కు అమలు చేసి నాడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే ఈరోజు దూరదృష్టి ఉన్న చంద్రబాబు సైతం అదే విధంగా వ్యవహరించడం అలాగే పథకాలను నిలిపివేస్తానని ఉద్దేశంతో ముందుకు సాగడం వంటివి అత్యంత సోచనీయం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు ఈ రెండు పథకాల విషయంలో దృష్టి పెట్టి అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.


మ‌రోవైపు.. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన వాటిలో ఈబీసీల‌కు, లా.. విద్యార్థుల‌కు ఎలాంటి ప‌థ‌కం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో గ‌త జ‌గ‌న్ స‌ర్కారు అమ‌లు చేసిన ఈ రెండు ప‌థ‌కాల‌పై ల‌బ్ధిదారులు ఆశ‌లు ఎక్కువ‌గా పెట్టుకున్నారు. దీంతో స‌ర్కారు నిర్ణ‌యం కోసం ఎదురు చూస్తున్న ప‌రిస్థితి కనిపిస్తోంది. అయితే.. దీనిని ఎలానూ అమ‌లు చేయ‌ర‌న్న ఉద్దేశం ఉండి ఉంటే.. ఆయా వ‌ర్గాల‌ను శాంతింప చేసేందుకు స‌ర్కారు ముందుకు రావాల్సి ఉంటుంది. లేక‌పోతే.. మున్ముందు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌శ్న‌లు ఎదుర్కొనే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: