ఇప్పుడు ఎక్కడ చూసినా, మంగళవారం కేంద్రం ప్రకటించిన బడ్జెట్ పైనే చర్చలు నడుస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను తొలి బడ్జెట్ ని తాజాగా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలోనే ఏపీ, బీహార్ కి మాత్రమే ఈ బడ్జెట్ లో న్యాయం జరిగిందని.. మిగిలిన రాష్ట్రాలను గాలికి ఒదిలేశారనే ఆరోపణలు చేస్తున్నారు కొందరు మేధావులు. బడ్జెట్లో తెలంగాణ అనే పేరే ఉచ్చరించలేదంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేయగా, మా రాష్ట్రాలకు కూడా కేంద్రం మొండి చేయి చూపిందని మిగతా రాష్ట్రాలవారు బోరుమంటున్న పరిస్థితి.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.15,000 కోట్లు సమకూర్చుకోవడానికి సహకరిస్తామని నిర్మల సీతారామన్ ప్రకటించిన తరువాత ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుడు.. సహకారం ఏ రూపంలో వచ్చినా ఇప్పటి పరిస్థితుల్లో అది ఉపయుక్తమే అంటూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ తో పాటు ఏపీ బీజేపీ నేతలూ తమ ఆనందాన్ని ప్రకటించడం జరిగింది. మరోపక్క ఏపీకి ఎక్కువ నిధులు ఇచ్చారంటూ పలువురు ఆరోపణులు చేస్తున్న సంగతి విదితమే.

ఈ నేపథ్యంలోనే తాజా బడ్జెట్ పైన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ స్పందించారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఆమె బీజేపీ నేతలపై విమర్శలు సంధించారు. ఆమె మాట్లాడుతూ... అసలు రాష్ట్ర రాజధాని కోసం రూ.15,000 కోట్లు అప్పుగా ఇచ్చారా.. లేదంటే, గ్రాంటుగా ఇచ్చారా? అనేది అర్ధం కాలేదు అంటూ మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా 15 మంది ఎంపీలను మద్దతుగా ఇచ్చినందుకు ఒక్కో ఎంపీకి రూ.1000 కోట్ల చొప్పున కొనుగోలు చేశారా ఏంటి? అంటూ తనదైన శైలిలో ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇది కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను బడ్జెట్ అనడం కంటే.. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎంతో బాగుండేదని అన్నారు. రాష్ట్ర బాగోగులకోసం సంవత్సరానికి రూ.లక్ష కోట్లు అవసరం ఉంటుందని చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తు చేస్తూ... లక్ష కోట్లు కావాలని అడిగిన బాబుకి 15 వేల కోట్లు ఎలా సరిపోతాయని అనుకుంటున్నారో అర్ధం కావడంలేదని విమర్శలు చేసారు!

మరింత సమాచారం తెలుసుకోండి: