వాస్తవానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోలింగ్ రోజున తాడిపత్రిలో రాళ్ల దాడులు కూడా ఎక్కువగా జరిగాయి. ఈ సమయంలో పోలీసులు వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారని కూడా వార్తలు వినిపించాయి. అలాగే కొంతమంది పైన తప్పుడు కేసులు పెట్టారని దీంతో చాలామంది టీడీపీ కార్యకర్తలు జైలుకు వెళ్లారని జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఆరోజు వైసిపి నేతలు చెప్పినట్టుగానే పోలీసులు సైతం వ్యవహరించారని కూడా తెలిపారు. తాజాగా అనంతపురం పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి..
పోలింగ్ రోజున తాడిపత్రిలో జరిగినటువంటి రాళ్లదాడికి తనతో పాటు తమ టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని ఎందుకు కేసులు పెట్టారు చెప్పాలి అంటూ పోలీసులను సైతం డిమాండ్ చేయడం జరిగింది. తమ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయో అంటూ నిలదీశారు జెసి ప్రభాకర్ రెడ్డి. దీంతో పోలీసులకు చాలా ఇబ్బందులు ఎదురైనట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన ఈ కేసులను సైతం ఉపసంహరించుకోవాలి అంటూ డిమాండ్ చేస్తూ అనంతపురం ఎస్పీని సైతం ప్రభాకర్ రెడ్డి కలిశారు. అలాగే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి మేరకే ఇలాంటి కేసులు పెట్టారని అందుకే ఈ కేసులను ఎత్తివేయాలని లేనిపక్షంలో తమ సత్తా చూపిస్తామంటూ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు తెలియజేశారు.