- ఇండియా కూటమిలోకి వెళితేనే షర్మిలకు బ్రేకులు
- వైసీపీ అధినేతకు ముందు నుయ్యి .. వెనక గొయ్యి ..
( రాయలసీమ - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమితో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. షర్మిల ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమికి.. తన ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కష్టపడుతున్నారు. అందుకు ఆమె విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే షర్మిల రాజకీయంగా ఎదిగేందుకు ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదన్న వ్యూహంతో జగన్ కనిపిస్తున్నారు. ఎందుకంటే షర్మిల ఏ మాత్రం కాంగ్రెస్‌ను బలోపేతం చేసినా.. అది ఖచ్చితంగా వైసీపీ ఓటు బ్యాంకుకు చిల్లు పెడుతుంది. అందుకే ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు పడుతున్నాయని జాతీయ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
అందుకు అనుగుణంగానే వైసీపీ అధినేత ఢిల్లీలో చేపట్టిన -ధర్మాకు ఇండియా కూటమిలోని కీలకమైన సమాజవాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొనడం కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లు అయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో జగన్ ఇండియా కూటమికి మద్దతు తెలిపితే కచ్చితంగా తనకు ఇబ్బందికర పరిస్తితులు ఎదురవుతాయి అన్నది జగన్‌కు తెలుసు. ఇదిలా ఉంటే సొంత సోదరి షర్మిల రెడ్డి జగన్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. షర్మిల సైతం వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో తానే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని తన ప్రణాళికలతో తాను ముందుకు వెళుతున్నారు.
ఇందుకోసం ఆమె చాప కింద నీరులా పని చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాను సైలెంట్‌గా ఉంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల సంగతి ఏమోగానీ.. తన సోదరితోనే తనకు ముప్పు ఉందని జగన్ గ్రహించారు. అందుకే ఇండియా కూటమిలోకి వెళ్లి.. షర్మిలకు బ్రేకులు వేయాలన్నదే జగన్ ప్లాన్‌గా తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్‌కు రాజకీయంగా ప్రస్తుతం తీవ్రమైన సంకట పరిస్థితులు ఉన్నాయి. ఆయనకు ముందు నుయ్య.. వెనక గొయ్య.. అన్న చందంగా వాతావరణం ఉంది.