- విదేశీ కంపెనీల‌కు 40 % ట్యాక్స్ త‌గ్గింపు
- దేశీయ కంపెనీల న‌డ్డి విరుస్తోన్న మోడీ..?
- ముద్ర రుణాల‌పై కేంద్రం ప‌బ్లిసిటీ స్టంట్‌..?

( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ )

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్ప‌డిన 3.0 ఎన్డీయే స‌ర్కారు దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు మాయ చేసేసిందా?  అంటే.. ఔన‌నే అంటున్నాయి పారిశ్రామిక‌వ‌ర్గాలు. అయితే.. క‌క్క‌లేక‌.. మింగ‌లేక‌.. నానా తిప్ప‌లు ప‌డుతున్నాయి. ఒక్క‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా దేశాన్ని విదేశాల‌కు రెడ్ కార్పెట్ ప‌రిచిన‌ట్టు ప‌రిచేశారు. ఇది అర్థం చేసుకోవ‌డం పెద్ద క‌ష్టం కాదు. చాలా తేలిక‌. బ‌డ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రెండు విష‌యాలు చెప్పారు.


1) భార‌త దేశాన్ని విదేశీ వ‌స్తు త‌యారీ కేంద్రంగా మారుతాం.

2) విదేశీ కంపెనీల‌కు(అంటే భార‌త్‌లో ఏర్పాటు చేసేవి) కార్పొరేట్ ట్యాక్స్‌ను 40 శాతం నుంచి 35 శాతానికి త‌గ్గించ‌డం.

ఈ రెండు విష‌యాల‌ను గ‌మ‌నిస్తే.. మోడీ బ‌డ్జెట్ మాయ స్ప‌ష్టంగా తెలుస్తుంది. ఒక‌వైపు భార‌త్‌ను వ‌స్తూత్ప‌త్తిలో త‌యారీ కేంద్రంగా మారుస్తామ‌ని చెబుతున్నారు. అంటే.. మేకిన్ ఇండియా ద్వారా.. మారు మూల ప‌ల్లెల్లోనూ కుటీర ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రోత్స‌హిస్తామ‌ని..త‌ద్వారా ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు పెంచుతామ‌ని దీంతో దేశం ఎదుర్కొంటున్న  నిరుద్యోగం త‌రిమేసిన‌ట్టు అవుతుంద‌న్న‌ది మోడీ వారి బ‌డ్జెట్ ఉవాచ‌. ఓకే అనుకుందాం. నిజ‌మేన‌ని న‌మ్మేద్దాం. ఇంకేముంది.. మ‌న  ద‌గ్గ‌రే బోలెడు వ‌స్తువులు త‌యారు అవుతాయి కాబ‌ట్టి.. మ‌న‌కు కారు చౌక‌గా.. దొరుకుతాయ‌ని భావిద్దాం. ఇది మొద‌టి సంగ‌తి!


ఇక‌, రెండో విష‌యానికి వ‌స్తే.. విదేశీ కంపెనీల‌కు రెడ్ కార్పెట్‌ప‌రిచేశారు. అంటే.. కార్పొరేట్ ట్యాక్సులు త‌గ్గించ‌డం. త‌ద్వారా.. విదేశీ కంపెనీల‌ను దేశంలోకి ఆహ్వానిస్తున్నారు. ప‌న్నుల భారం ఉంటే వ‌చ్చేందుకు విదేశీ కంపెనీలు ఎలానూ రావు. సో.. ఈ నేప‌థ్యంలో వాటిపై ప‌న్నులు త‌గ్గించేశారు. దీంతో విదేశీ కంపెనీలు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చేయాల‌న్నది బ‌డ్జెట్ సారాంశం. ఇదే జ‌రిగితే.. అవి కూడా వ‌చ్చిన కంపెనీలు చేతులు ముడుచుకుని కూర్చోవు క‌దా!


అవికూడా.. వ‌స్తూత్ప‌త్తుల‌ను పెంచుతాయి. త‌ద్వారా.. స్థానిక ఉత్ప‌త్తుల‌కు గిరాకీ ప‌డిపోవ‌డం ఖాయం. అంటే.. జుట్టు జుట్టు ముడేయ‌డం అన్న మాట‌. విదేశీ కంపెనీలు తొలినాళ్ల‌లో కారు చౌక‌గా ఇచ్చినా ఆశ్చ‌ర్యం లేదు. ఎందుకంటే.. అవి పెట్టుదారీ సంస్థ‌లు. కానీ.. ఇక్క‌డ ముద్ర రుణాలు ఇప్పించి.. కుటీర ప‌రిశ్ర‌మ‌లు  ఏర్పాటు చేయించి.. ఉపాధి క‌ల్పించామ‌ని చంక‌లు గుద్దుకునేందుకు మోడీ స‌ర్‌కి అవ‌కాశం వ‌చ్చినా.. విదేశీ కంపెనీల పోటీ ముందు.. మ‌నోళ్లు తెల్ల‌మొహం వేయాల్సిందే.. బిక్క మొహంతో దేబిరించాల్సిందే. ఇదీ... మోడీ మాయ‌!!

మరింత సమాచారం తెలుసుకోండి: