ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. మరో పథకానికి మంగళం పాడిందా? అంటే అవుననే అంటోన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఆరోగ్యశ్రీ అంటేనే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దేశంలో విప్లవాత్మక పాలనకు నాంది పలికింది కూడా ఆయనే. పేదవారికి వైద్యం , విద్య అందితే అభివృద్ధి దానంతట అదే జరుగుతుందని భావించిన నేత రాజశేఖర్ రెడ్డి.అందుకే ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను తీసుకొచ్చారు.పేదవాడికి విద్యను దగ్గరకు చేర్చారు.రాజశేఖర్ రెడ్డి తర్వాత బాధ్యతలు స్వీకరించిన రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించారు. బడ్జెట్లో సైతం కేటాయింపులు చేశారు. అయితే జగన్ ఏకంగా ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచారు. అయితే ఇది హర్షించదగ్గ పరిణామమే అయినా.. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు విషయంలో మాత్రం జగన్ జాప్యం చేశారు. ఎప్పటికప్పుడు నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆరోగ్యశ్రీ అమలు విషయంలో సీరియస్ నెస్ తగ్గింది. ఆ ప్రభావం వైద్య సేవలపై పడింది.తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తోన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ కార్డును అందరూ తీసుకునేలా చర్యలు చేపడతామంటూ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గుంటూరు లోక్‌సభ పరిధిలో ఈ కార్డును పొందడానికి మూడు లక్షల కుటుంబాలకు అర్హత ఉంటే కేవలం 28,000 కార్డులు మాత్రమే ఇఫ్పటివరకు ఇచ్చారని చెప్పారు.ఒక్క గుంటూరులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డును తీసుకునేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రతి ఒక్కరు కూడా ఆయుష్మాన్ భారత్‌లో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్డుల ద్వారా అయిదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సౌకర్యాన్ని పొందవచ్చని అన్నారు.ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే ఆయుష్మాన్ భారత్‌ను వినియోగించుకోవచ్చని పెమ్మసాని వివరించారు. ఏపీలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడానికి అవసరమైనన్ని డబ్బులు లేవని ఆయన తేల్చి చెప్పారు. ఈ పథకం కింద ఆసుపత్రులకు బిల్లులు కూడా రావట్లేదని స్పష్టం చేశారు. రోగులకు ట్రీట్‌మెంట్ కూడా జరగట్లేదని అన్నారు.పెమ్మసాని చేసిన ఈ వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. నిధులు లేవనే కారణంతో 25 లక్షల రూపాయల వరకు హెల్త్ కవరేజీని అందించే ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్ మంగళం పాడినట్టేనంటూ ఆరోపిస్తోన్నారు. ఆరోగ్యశ్రీ కి బదులుగా ఏపీ ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ను తెర మీదికి తెచ్చిందంటూ కామెంట్స్ చేస్తోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: