2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ విజయం సాధించిన జనసేన పార్టీ.. అధికారంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ 100 శాతం విజయంతో రాష్ట్ర జనసేన నేతల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అలాగే తమ అధినాయకుడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో పాటు కీలక మంత్రి పదవులు జనసేనకు వచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సభ్యత్వాల నమోదు జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో నెల రోజులుగా జరుగుతున్న సభ్యత్వ నమోదు దాదాపు 10 లక్షలకు చేరుకున్నట్లు నాగబాబు చెప్పుకొచ్చారు. ఇది గత సంవత్సరం కంటే ఎక్కువే అని తెలిపారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో 5 వేల సభ్యత్వాలు కావాలని.. సభ్యత్వ నమోదుకు మరో వారం రోజులు గడువు ఇస్తున్నట్లు జనసేన కీలక నేత నాగబాబు తమ పార్టీ నేతలకు ఆదేశించారు.ఇప్పటి వరకు 10లక్షల సభ్యత్వం నమోదైనందుకు జనసేన ఐటీ టీమ్‌ సభ్యులతో పాటు కష్టపడి అద్బుతంగా పని చేసిన వాలంటీర్లు, జనసైనికులు, వీర మహిళలకు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభినందనలు తెలిపారు. క్రియాశీల సభ్యత్వం ద్వారా వచ్చిన ప్రతి పైసా కార్యకర్తల సంక్షేమానికే వినియోగిస్తామన్నారు. ప్రతి నియోజక వర్గంలో 5వేలు సభ్యత్వం చేయాలని తొలుత టార్గెట్‌ పెట్టుకున్నామని, పది రోజుల కాలంలో 10లక్షల సభ్యత్వం నమోదు కావడం మంచి అచీవ్‌మెంటన్నారు.

శాసన మండలి సభ్యులు పి హరిప్రసాద్‌ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరు అద్బుతంగా పని చేశారని గత ఏడాది నెల రోజుల పాటు సభ్యత్వ నమోదు కొనసాగితే ఈ సంవత్సరం పది రోజుల పాటు మాత్రమే కొనసాగిందన్నారు. గత ఏడాదితో పోల్చితే సభ్యత్వాలు రెట్టింపు అయ్యాయని, పవన్‌ కళ్యాణ్‌పై ఉన్న నమ్మకమే ఇంత పెద్ద మొత్తంలో సభ్యత్వం నమోదు కావడానికి ప్రధాన కారణమన్నారు. పవన్‌ కళ్యాణ్‌ సభ్యత్వ నమోదుపై ఆదివారం సమీక్ష చేశారని, ఆ సమీక్షలో వచ్చిన అభ్యర్థనల మేరకు నమోదు కార్యక్రమాన్ని మరో వారంపొడిగించినట్లు చెప్పారు.ఈ నెల 28తో సభ్యత్వం నమోదు గడువు ముగిసింది. అయితే ఆగస్టు 5వరకు గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. తీవ్ర వర్షాలు ఇబ్బంది పెట్టినట్లు, సభ్యత్వ నమోదు సమయం మరికొన్ని రోజులు పెంచాలని విజ్ఞప్తులు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సభ్యత్వ నమోదు గడువును మరో వారం రోజుల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.గత ఏడాది కంటే ఎక్కువగా, రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: