విజయమ్మ విజయానికి కంభంపాటి హరిబాబు బ్రేకులు వేశారు. 2014 ఎన్నికల్లో పార్టీ ఓటమి ఆ పార్టీ నేతలను ఎంతలా బాధ పెట్టిందో విజయమ్మ ఓటమి అంతకు మించి ఆ పార్టీ నేతలను బాధ పెట్టిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే 2014 ఎన్నికల్లో విజయమ్మ ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
విజయమ్మ స్థానికేతురాలు కావడం ఒక కారణం కాగా కడప తరహా ఫ్యాక్షన్ సంస్కృతిని విశాఖకు తీసుకు వస్తారని విపక్షాలు జోరుగా ప్రచారం చేయడం కూడా విజయమ్మ ఓటమికి కారణమని చాలామంది ఫీలవుతారు. విజయమ్మను ఎంపిగా గెలిపించడం ద్వారా ప్రశాంత విశాఖ నగరంలో ఫ్యాక్షన్ సంస్కృతి పెచ్చుమీరుతుందంటూ అప్పట్లో కొంతమంది నేతలు చేసిన ప్రచారం ఆమెకు ఒక విధంగా మైనస్ అయిందని చెప్పవచ్చు.
విజయమ్మ ఎంపీగా పోటీ చేసిన విశాఖ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటమి పాలుకావడం, కనీస ఓటింగ్ కూడా లేని బిజెపి అభ్యర్థికి సుమారు లక్ష ఓట్ల మెజార్టీ రావడం పరిశీలిస్తే జరిగిన ప్రచారాన్ని విశాఖ ప్రజలు బాగానే నమ్మారని చెప్పవచ్చు. పార్టీలోని పెద్దలు సైతం కష్టపడినా బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబునే ప్రజలు నమ్మడం కొసమెరుపు. విజయమ్మకు కంభంపాటి కనీవిని ఎరుగని ఓటమిని రుచి చూపించారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. విజయమ్మ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొడుకు కంటే కూతురుకు విజయమ్మ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.