( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

తెలంగాణలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక ఎంతోమంది బీసీలకు రాజ్యాధికారం ఇచ్చారు. అలాంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో డీలా పడిపోయింది. 2014 - 2018 ఎన్నికలలో అక్కడ కొన్ని సీట్లు గెలుచుకున్నా 2023లో జరిగిన సాధారణ ఎన్నికలలో మాత్రం తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేయలేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో బంపర్ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది.


వాస్తవానికి రెండేళ్ల ముందు నుంచి తెలంగాణపై చంద్రబాబు బాగా ఫోకస్ పెట్టారు. మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించారు. అయితే గత డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు పోటీ చేయలేదు. దీంతో కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంతో తెలంగాణ పై కూడా ఫోకస్ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత అరవింద్ కుమార్ గౌడ్‌కు తెలంగాణ తెలుగుదేశం పగ్గాలు అప్పగించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.


అరవింద్ కుమార్ గౌడ్ బీసీ నేత మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్‌కు స్వయానా మేనల్లుడు కావడం విశేషం. అలాగే 2004 ఆసిఫ్ నగర్‌ ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ముందు నుంచి కూడా పార్టీ కోసం కమిట్మెంట్తో పని చేస్తూ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. అందుకే అరవింద్ కుమార్ గౌడ్‌కు పార్టీ పగ్గాలతో పాటు ఏదైనా కీలక పదవి కట్టబెట్టడం ద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు బలమైన పునాదులు వెయ్యాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: