హసీనా.. ఈపేరు సోమవారం రోజు అంతర్జాతీయ మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచింది. ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ జరుగుతోంది.బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్‌ల వివాదం హింసాత్మకంగా మారడంతో ఆ ఆదేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. రిజర్వేషన్‌లను సవరించాలని ఆందోళనకారులు పట్టుబట్టడంతో ఆమె రాజీనామా చేయకతప్పలేదు. ఆదివారం ఒక్కరోజు చెలరేగిన అల్లర్లతోనే దేశవ్యాప్తంగా 72 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటికే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రధాని నివాసానికి భారీగా నిరసన కారులు చేరుకొని షేక్ హసీనా అధికారిక నివాసాన్ని ముట్టడించారు. దీంతో ముందే షేక్ హసీనా అంతకుముందే తన అధికారిక నివాసాన్ని విడిచి వెళ్లారు.రిజర్వేషన్ల కోటా అంశం బంగ్లాదేశ్‌ను రణరంగంగా మార్చింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఇక రైల్వేలు నిలిచిపోయాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో బంగ్లాదేశ్ సైన్యం రంగంలోకి దిగింది. ప్రధానమంత్రి షేక్ హసీనాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో.. ఆమె రాజధాని ఢాకాలో ఉన్న ప్రధానమంత్రి ప్యాలెస్ నుంచి హెలికాప్టర్‌లో పారిపోయారు. ఈ క్రమంలోనే తన పదవికి రాజీనామా చేశారు. అయితే బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన షేక్ హసీనా.. పక్కనే ఉన్న మన దేశంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆందోళనకారుల నుంచి తప్పించుకుని వచ్చి.. భారత్‌లో తలదాచుకున్నట్లు సమాచారం.బంగ్లాదేశ్‌లో సైనిక పాలన విధిస్తున్నట్లు ఆ దేశ ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జామన్ ప్రకటించారు. తాము శాంతి భద్రతలను అదుపులోకి తెస్తామని చెప్పారు. తాను పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. త్వరలోనే బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలంతా సంయమనం పాటించాలని ఆ దేశ అధికారిక మీడియా ద్వారా వెల్లడించారు.బంగ్లాదేశ్ లో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆందోళనకారులు ఆయుధాలను చేతపట్టి వాహనాలు, దుకాణాలు, కార్యాలయాలను ధ్వంసం, దగ్ధం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లపై అధికార
పార్టీ నేతల నివాసాలు, కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడుతున్నారు.ఆదివారం మొదలైన ఈ అల్లర్లు సోమవారం రెండో రోజు కూడా కొనసాగాయి. ఇవాళ వేలాది మంది నిరసనకారులు
రాజధాని ఢాకాలో విధ్వంసం సృష్టించారు.
జాతిపిత షేక్ ముజిబుర్ విగ్రహాన్ని ధ్వసం చేశారు. ఇక ఢాకాలోని పీఎం అధికారిక నివాసం గణభబన్‌ను ముట్టడించారు. కొందరు నిరసనకారులు పీఎం నివాసంలోకి చొచ్చుకెళ్లారు. రెండు రోజులుగా సాగుతున్న ఈ అల్లర్లలో ఇప్పటి వరకూ 300 మందికిపైగా మృతి చెందినట్లు
స్థానిక మీడియా నివేదించింది.