రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 40 శాతం మంది ప్రజలు తమతోనే ఉన్నారని, తమకు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చిందని పదేపదే చెబుతున్న వైసిపి అధినేత జగన్ కోసం రెండు నెలల తర్వాత కూడా జనం ఉన్నారా? అనేది ప్ర‌శ్న‌. అలానే జగన్ కోసం నడిచేందుకు జ‌నం సిద్ధంగానే కనిపిస్తున్నారా అంటే ప్రశ్నార్థకంగానే మారింది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత ప్రజల్లో మార్పు అయితే కనిపిస్తోంది. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి విడతలోనే పింఛన్లను పెంచడం పెంచిన పింఛన్లను కచ్చితంగా ఒకటో తారీకు నాడు ఇవ్వడం వంటివి జనంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై నమ్మకం పెంచాయి.


ఇంకా సూపర్ 6 పథకాలు అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి వేచి చూసే ధోర‌ణిలోనే ప్రజలు ఉన్నారు. వాటిని కూడా అమలు చేస్తారన్న విశ్వాసం, నమ్మకం ప్రజల్లో కనిపిస్తున్నాయి.  ఈ పరిణామం కూటమి ప్రభుత్వానికి సానుకూలంగా మారితే, ఇదే సమయంలో ఈ రెండు నెలల కాలంలో జగన్ వెంట ఉన్న జనం కూడా ఆయనను నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. అధికారం ఉంటే ఒక రకంగా అధికారం లేకపోతే మరో రకంగా వ్యవహరిస్తారని వాదన రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లో కూడా వినిపిస్తోంది.


నిజానికి 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చిన‌ ఏ పార్టీ అయినా ప్రజల్లోకి వచ్చి ఉండాలి. ప్రజల సమస్యలను పట్టించుకునే విధంగా, ప్రజల పట్ల విధేయత చూపించే విధంగా వ్యవహరించి ఉండాలి. కానీ, ఈ రెండు విషయాల్లో వైసిపి నాయకులు ఆ పార్టీ అధినేత కూడా ఎక్కడ స్పందించలేదు. ప్రజలు త‌మ‌కు అధికారం ఇవ్వలేదన్న ఆవేద‌న‌లోనే ఇంకా ఆ పార్టీ నాయకులు ఉండిపోవడం గ‌మ‌నార్హం. దీనిని సమర్థిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం విశేషం. దీంతో జగన్ కోసం జనం ఉన్నారా? లేరా? అనే విషయాన్ని పరిశీలిస్తే ఇప్పటికిప్పుడైతే జగన్ కోసం జనం లేరనే చెప్పాలి.


మున్ముందు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్థానిక సంస్థలైనా, ఎమ్మెల్సీ అయినా ఏదైనా కూడా జగన్ వెంట జనం ఉన్నారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేస్తాయి. కానీ ఈ రెండు మాసాల గ్రాఫ్ ను పరిశీలిస్తే జగన్ తమతో ఉన్నారన్న భావన ప్రజల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ప్ర‌తిప క్షంగా జ‌గ‌న్ జ‌నంలోకి రాలేదు. ప్రజల సమస్యలను పట్టించుకోలేదు. ప్రజలకు మ‌ద్ద‌తు ఇచ్చే విధంగా కూడా ఒక మీటింగ్ కూడా పెట్టలేకపోయారు. దీనికి తోడు పార్టీ వర్గాల్లోనూ ఇక వైసిపి కోలుకునే పరిస్థితి ఉంటుందా ఉండదా అనే చర్చ కూడా ప్రారంభమైంది.


మొత్తంగా చూస్తే ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితి ఈ రెండు నెలల కాలంలో వైసీపీకి లేదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. మున్ముందు అయినా వైసీపీ పుంజుకోవాలంటే జనంలోకి జగన్ రావాల్సిన అవసరం ఉంది. జనంలోకి ఆయ‌న‌ రానంతవరకు ఆయన కోసం జనం ఉంటారు అనుకోవడంలో కేవలం భ్ర‌మ‌ మాత్రమే మిగులుతుంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: