- బతిమిలాడినా.. బుజ్జగించినా వినని గులాబీ ఎమ్మెల్యేలు
( హైదరాబాద్ - ఇండియా హెరాల్డ్ ) .
ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఒక రేంజ్ లో ఆపసోపాలు పడుతోంది. ఎమ్మెల్యేలు పార్టీని వీడిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యమని ..ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆ పార్టీ యువనేత.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఆపసోపాలు పడుతున్న పరిస్థితి. కేటీఆర్ ఎమ్మెల్యేలు పార్టీలు మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేల వలసలకు మాత్రం బ్రేకులు పడడం లేదు. బీఆర్ ఎస్ హై కమాండ్ విషయంలో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు .. నేతలకు ఎంత మాత్రం నమ్మకాలు లేవని క్లీయర్ గా అర్థమవుతోంది.
కేటీఆర్ ఎన్ని వార్నింగ్ లు ఇస్తున్నా.. బతిమి లాడుతున్నా.. బుజ్జగిస్తున్నా కూడా ఎమ్మెల్యేల వలసలకు బ్రేకులు పడే సూచనలు ఎంత మాత్రం కనపడడం లేదు. ఈ మేరకు ఎమ్మెల్యేలను ఎలా ? కాపాడు కోవాలనే దానిపై గులాబీ బాస్ కేసీఆర్ కొద్ది రోజులుగా పార్టీ కీలక నేతలతో పాటు తమ ఫ్యామిలీ మెంబర్స్ తో సమాలోచన లు జరుపుతున్నట్టు గా తెలుస్తోంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా స్వీప్ చేసేందుకు ఎమ్మెల్యేల చేరికల ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేయనుందని అంటున్నారు.
రేవంత్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మరింత స్పీడప్ చేస్తుందని తెలుస్తోంది. ఇక పార్లమెంటు ఎన్నికలలో అసలు బీఆర్ ఎస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. దీంతో పార్టీ భవితవ్యం ఎలా ఉంటుందన్న సందేహాలు ఉండనే ఉన్నాయి. దీంతో కేసీఆర్ సరికొత్త ప్లానింగ్ లు వేసుకుని అయినా పార్టీని కాపాడు కోవాలని గులాబీ బాస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.