ఒకవేళ టీడీపీ అధినేత తెలంగాణపై ఫోకస్ పెడితే.. ఎక్కడి నుంచి రంగంలోకి దిగుతారనేది సస్పెన్స్‌గా మారింది. గ్రామస్థాయిలో టీడీపీకి చెందిన కేడర్ అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్‌వైపు మళ్లడంతో.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పార్టీని యాక్టివేట్ చేయాలని చూస్తున్నారు. దీంతో.. ఇతర పార్టీల్లో చేరిన వాళ్లంతా తిరిగి సొంత గూటికి వస్తే.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దించాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. గ్రామస్థాయిలో పార్టీ కేడర్ అంతా చీలిపోవడంతో.. మున్సిపల్, జెడ్పీ ఎన్నికల్లో పోటీ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలోనూ టీడీపీ బాస్ ఉన్నారు.తెలంగాణలో టీడీపీ బలోపేతానికి ముందు రాష్ట్రస్థాయిలో అధ్యక్షుడు, కార్యవర్గం.. బలమైన నేతలు అవసరం. రాష్ట్ర విభజన తర్వాత.. తెలంగాణ అధ్యక్షులుగా ఎల్ రమణను నియమించారు. ఆయన బీఆర్ఎస్‌లో చేరడంతో.. కాసాని జ్ఞానేశ్వర్‌ను అధ్యక్షుడ్ని చేశారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయని కారణంగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కాసాని కూడా బీఆర్ఎస్‌లో చేరారు. దాంతో.. తాత్కాలిక అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును నియమించారు. ప్రస్తుతం ఆయన తాత్కలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జాతీయ పార్టీగా మరింతగా దేశంలో ఎక్స్ పోజ్ కావాలంటే.. తెలంగాణలోనూ టీడీపీ కీలక రోల్ పోషించాల్సిందేనని.. ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. పూర్వవైభవం కోసం.. ముందు నుంచి ఉన్న కార్యకర్తలను కాపాడుకోవడంతో పాటు.. గ్రామస్థాయిలో పసుపుజెండా మోసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు చంద్రబాబు. అవసరమైతే.. ఏపీలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చి.. వారి ద్వారా ఇక్కడ టీడీపీని బలోపేతం చేయాలనుకుంటున్నారు.
ఏపీలో అధికారం చేపట్టాక.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చిన చంద్రబాబు.. ఇక్కడి నేతలతోనూ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. టీడీపీకి పూర్వవైభవం కోసం.. పార్టీ అధ్యక్షుడు, సభ్యత్వ నమోదుపై చర్చించారు. నిన్నటి సమావేశంలో.. పొలిట్‌బ్యూరో కూడా తెలంగాణలో పార్టీ బలోపేతానికి మొగ్గు చూపడంతో.. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యచరణ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. సో మొత్తానికి.. దశాబ్దకాలంగా తెలంగాణలో.. స్తబ్దుగా ఉన్న టీడీపీ మళ్లీ యాక్టీవేట్ అయ్యే అవకాశం ఉంది.ఈ భేటీకి మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, బొండా ఉమామహేశ్వర రావు, పల్లా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే కార్యకర్తలకు సంబంధించి చంద్రబాబు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తెలుగు దేశం పార్టీ సభ్యులకు ఇచ్చే ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది వాట్సాప్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు. ఓటీపీ ఎంటర్ చేసి రూ.100 రుసుం చెల్లించి సభ్యత్వం తీసుకోవచ్చు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి వెంటనే వాట్సాప్‌లోనే కార్డు అందజేస్తారు.