ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబానికి ఏ స్థాయిలో గుర్తింపు, ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న ధర్మాన కుటుంబం తర్వాత వైసీపీలో చేరింది. ఏపీలోని ప్రముఖ సీనియర్ నేతలలో ధర్మాన ఒకరు కాగా 30 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో కెరీర్ ను కొనసాగించి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలలో ఆయన కూడా ఒకరిగా నిలిచారు.
 
నరసన్నపేట నుంచి రెండుసార్లు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మాన 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ చేతిలో ఓటమిపాలయ్యారు. నియోజకవర్గంలో వైసీపీపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉండటంతో శంకర్ రాజకీయాల్లో జూనియర్ అయినప్పటికీ ఆయన చేతిలో ధర్మాన ఓటమిపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు.
 
అయితే ఎన్నికల ఫలితాలు ధర్మానను ఎంతో బాధ పెట్టాయని రాజకీయాలలో కెరీర్ ను కొనసాగించాలని ఆయన భావించడం లేదని తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ధర్మానకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పోటీ చేయాల్సి వచ్చింది. కొడుకు రామ్ మనోహర్ నాయుడుకు పొలిటికల్ బాధ్యతలను అప్పగించాలని ధర్మాన ఫీలవుతున్నారని సమాచారం.
 
రామ్ మనోహర్ నాయుడు ఇప్పటికే పాలిటిక్స్ లో ఉన్నా రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ధర్మాన తన స్థానాన్ని కొడుకుతో భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నా ఆయన ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. అయితే ధర్మాన నిర్ణయం విషయంలో జగన్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. ధర్మాన తన సన్నిహితుల దగ్గర రాజకీయాలకు గుడ్ బై చెబుతానని చెబుతున్నట్టు భోగట్టా.
 
ధర్మాన వయస్సు ప్రస్తుతం 66 సంవత్సరాలు కాగా తాను రాజకీయాల్లో కెరీర్ ను కొనసాగిస్తే కొడుకు పొలిటికల్ భవిష్యత్తు సైతం ప్రమాదంలో పడే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: