మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ నివాసం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారులు అంబాపురంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. మొత్తం 15 మంది ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టారని భోగట్టా.
 
సీఐడీ జప్తు చేసుకున్న భూములను కొనుగోలు చేసి విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి ఈ తనిఖీలు జరుగుతుండటం గమనార్హం. మరోవైపు జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో జోగి రమేష్ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల వైఖరి విషయంలో జోగి రమేష్ నిరసన తెలియజేశారు.
 
జోగి రమేష్ మాట్లాడుతూ అగ్రి గోల్డ్ లో మా ఫ్యామిలీ తప్పు చేసినట్టు ప్రూవ్ చేస్తే విజయవాడ నడిరోడ్డుపై ఉరి వేసుకుంటామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన కామెంట్లు చేశారు. మా కొడుకు విదేశాలలో ఉన్నత చదువులు చదువుకున్నాడని జాబ్ చేశాడని మా కుటుంబంపై జరిగిన దాడి బలహీన వర్గాలపై జరుగుతున్న దాడి అని ఆయన పేర్కొన్నారు.
 
నేను గౌడ కులం నుంచి అంచెలంచెలుగా ఎదిగానని ఆయన చెప్పుకొచ్చారు. కోపం ఉంటే నాపై కక్ష తీర్చుకోవాలే తప్ప నా కొడుకును అన్యాయంగా అరెస్ట్ చేయడం సరికాదని ఆయన వెల్లడించారు. చంద్రబాబుకు కూడా కొడుకు ఉన్నాడని తప్పుడు కేసులు బనాయించడం సరి కాదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు వంకర బుద్ధిని మార్చుకుంటే బాగుంటుందని జోగి రమేష్ వెల్లడించారు. మాజీ మంత్రి  జోగి రమేష్ కామెంట్లకు సంబంధించి టీడీపీ నేతల నుంచి ఏమైనా కౌంటర్ వస్తుందేమో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: