అడుగుకో గుంత. గజానికో గొయ్యి. క్షుణ్ణంగా చెప్పాలంటే ఏపీ రోడ్ల పరిస్థితి ఇది. ఇటీవల కురిసిన వర్షాలకు ఇవి చిన్నపాటి చెరువులను తలపించాయి. రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారుల పరిస్థితి కూడా  దాదాపు ఇలానే ఉంది. ఇంక గ్రామీణ రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పకపోవడమే నయం.


వైసీపీ హయాంలో రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి అని అధికారంలోకి రాకముందు నుంచి కూటమి నేతలు దుమ్మెత్తిపోశారు. తాము అధికారంలోకి వస్తే రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ కూడా ఇచ్చారు. అయితే ఏపీలో వైసీపీ ఘెర ఓటమికి రోడ్లు కూడా ఒక కారణంగా పలు విశ్లేషణలు వచ్చాయి. ఇంతకీ నాటి వైసీపీ ప్రభుత్వం రోడ్ల మరమ్మతుల కోసం.. నిర్మాణాల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదా అంటే.. కచ్చితంగా కాదనే సమాధానం వినిపిస్తుంది. కానీ.. గత ప్రభుత్వ ప్రతిపాదనల వల్ల రాష్ట్రానికి కేంద్రం పలు రహదారుల నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది.


ఏపీ వ్యాప్తంగా మొత్తం ఏడు రోడ్లకు సంబంధించి లైన్ క్లియర్ చేసి చంద్రబాబు సర్కారుకి అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని కేంద్రం పార్లమెంట్ లో అధికారికంగా ప్రకటించింది. కృష్ణా జిల్లా రామారావు పేట నుంచి గుంటూరులోని ఖాజా టోల్ గేట్ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రూ.2,718 కోట్లను మంజూరు చేసింది. అలాగే వినగొండ, గుంటూరు నాలుగు లైన్ల రహదారికి రూ.2360 కోట్లను ప్రకటించింది.


దీంతో పాటు అనకాపల్లి జిల్లా సబ్బవరం నుంచి విశాఖ జిల్లా శీలా నగర్ వరకు ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి రూ.906 కోట్లు, విజయవాడ లోని మహానాడు జంక్షన్ నుంచి నిడమనూరు వరకు ఆరు లైన్ల ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రూ.669 కోట్లు, చెన్నై, కోల్ కతా జాతీయ రహదారి మీద రహస్థలం దగ్గర విడిచిపెట్టిన ఆరు లైన్ల రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.325 కోట్లు, గన్నవరం సమీపంలోని గుండుగొలను గ్రామం జంక్షన్ వద్ద నాలుగు లైన్ల ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రూ.150 కోట్లు, జాతీయ రహదారి 44 మీద 416 కి.మీ. వద్ద అసంపూర్తి పనుల కోసం రూ.140 కోట్లను గత వైసీపీ ప్రభుత్వం 2023 డిసెంబరులో ప్రతిపాదిస్తే కేంద్రం తాజాగా ఓకే చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: