ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం పత్రాలు దగ్ధం ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గత ప్రభుత్వ తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలే పత్రాలు దగ్ధం చేస్తున్నారన్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు.అధికారం కోల్పోగానే కీలకమైన దస్త్రాలను మంటలపాలు కావడం రివాజుగా మారింది. మొన్నటికి మొన్న మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో రెవెన్యూ శాఖకు సంబంధించిన దస్త్రాలు దహనం అయిపోయాయి. భూ అక్రమాలకు ఆధారాల్లేకుండా నిజాలకు నిప్పు పెట్టారు. ఆ ఘటనపై దర్యాప్తు సాగుతుండగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన దస్త్రాలు దగ్ధం కావడం కలకలం రేపుతోంది. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు ఏదైనా కిరికిరి ఉంటే తప్ప దస్త్రాలు కాల్చేయడానికి పెద్ద కారణాలు ఉండవు. ఈ పోలవరం ఫైల్స్‌లోనూ అదే స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ నేతలు ఐదేళ్లలో చేసిన అక్రమాలు బయటకు వస్తాయనే భయంతో దస్త్రాలు తగలబెట్టారని జోరుగా ప్రచారం సాగుతోంది.
 ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో  దస్త్రాలు దగ్ధం కావడం చర్చనీయాంశమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ సంబంధించిన దస్త్రాలు దగ్ధమైనట్లు సమాచారం. లబ్ధిదారుల పరిహారం అక్రమాలు బయటకు వస్తాయనే కార్యాలయంలోని అధికారులే దస్త్రాలు కాల్చేశారని అనుమానం కలుగుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. శుక్రవారం రాత్రి దస్త్రాలు తగలబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.

కాల్చివేసిన దస్త్రాలను ఇన్‌ఛార్జ్‌ సబ్ కలెక్టర్ శివ జ్యోతి, డీఎస్పీ భవ్య కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పరిశీలించారు. సగం కాలిపోయిన దస్త్రాలను స్వాధీనం చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందజేసిన పరిహారం సంబంధించిన దస్రాలుగా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుమతి తీసుకోకుండానే శుక్రవారం రాత్రి కార్యాలయం సిబ్బంది దస్త్రాలు తగులబెట్టేశారని తెలుస్తోంది. ఫైల్స్ ఎందుకు కాల్చేశారు? అనే అంశాలపై అధికారుల బృందం ఆరా తీస్తోంది.
పత్రాలు దగ్ధం అయితే ఆధారాలు ఉండవా అని ప్రశ్నించారు. పత్రాలన్నీ డిజిటలైజేషన్ జరిగాయన్నారు. మదనపల్లె సబ్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం అయితే మంత్రి పెద్దిరెడ్డి తగులబెట్టించారని కొందరు నేతలు ప్రచారం చేశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పత్రాలు ఒక్క చోటే ఉంటాయా అని ప్రశ్నించారు.ఫైళ్ల దగ్ధంపై ఆధారాలు ఉంటే కేసులు పెట్టాలని సూచించారు.అబద్ధాలను నమ్మించే ప్రయత్నాలు ఎంతకాలం చేస్తారని మాజీ మంత్రి అంబటి నిలదీశారు.
 

పోలవరం ఎడమ కాలవ సంబంధిత దస్త్రాలు దహనం కాలేదని ఆర్డీవో శివజ్యోతి తెలిపారు. జిరాక్స్ పేపర్లు, సంతకాలు లేనివి మాత్రమే దహనం చేశారని, అనుమతి లేకుండా ఎందుకు దహనం చేశారో విచారణ చేస్తామని వెల్లడించారు. ఇన్‌స్టిట్యూషన్ హెడ్‌ సంతకాలు లేవు కనుక అంత ముఖ్యమైనవి కావని అనుకుంటున్నామని అన్నారు. కార్యాలయానికి కొత్త బీరువాలు వచ్చాయని, దస్త్రాలు సర్దుకునే క్రమంలో అవసరం లేనివి కాల్చారని, అనుమతి లేకుండా దస్త్రాలు దహనం చేయడంపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఫైళ్ల దగ్ధం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఫైళ్లు దగ్ధం జరిగిన ప్రాంతాన్ని పోలవరం స్పెషల్ కలెక్టర్ సరళ పరిశీలించారు. ఫైళ్ల దగ్ధంపై అధికారుల నుంచి ఆరా తీశారు. అయితే దగ్ధమైన పత్రాలు ఉపయోగంలో లేనివని అధికారులు స్పష్టం చేశారు. నిరుపయోగంగా ఉన్న పేపర్లను మాత్రమే తగలబెట్టామని తెలిపారు. పోలవరం ఎడమకాలువ పరిహారం ఫైల్స్ కాదని చెప్పారు. పోలవరం LMC ఆఫీసులో పనికిరాని కాగితాలనే పడేశామన్నారు. ఆ పేపర్లతో ఆర్ అండ్ ఆర్కు సంబంధం లేదని తెలిపారు. సిబ్బంది తగలబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివని స్పెషల్ కలెక్టర్ సరళ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: