ముఖ్యంగా ఒక్కో ఛానల్ కి రూ .50 కోట్ల చొప్పున పరువు నష్టం నోటీసులు పంపించారట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తనపై ఆధారాలు లేకుండా , వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారికి న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆయన తెలిపారు. ఇప్పుడు నోటీసులు పంపించగా త్వరలోనే కేసు వేస్తానని ఆయన తెలిపారు. ఇకపోతే తమపై పనిగట్టుకొని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని కూడా తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు. చంద్రబాబు తప్పులను కొన్ని మీడియా సంస్థలు కప్పేసే ప్రయత్నం చేస్తున్నాయి. తమపై పని కట్టుకొని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయి. రెండు నెలల్లో ఆరోగ్యశ్రీకి రూ.2500 కోట్లు ప్రభుత్వం బకాయి పడిందని అన్నారు. ఆరోగ్యశ్రీని కూడా చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులను పిపిపి పద్ధతిలోకి తీసుకొస్తామని చెప్పారు . మరి రానున్న రోజుల్లో పేదలు ప్రభుత్వాసుపత్రుల్లో కూడా ఫీజులు చెల్లించి వైద్యం తీసుకునే పరిస్థితి వస్తుందేమో అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే పెద్దిరెడ్డి గతంలో చెప్పినట్లుగానే మీడియా సంస్థలకు పరువు నష్టం నోటీసులు పంపగా, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం , ఫైల్స్ కాలిపోయిన ఘటనలో తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.