ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా.. సీబీఎన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గెజిట్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.సీబీఐకి (సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌) ఇక ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంట్రీ ఉంది..! ఎందుకంటే.. ఏపీలో ఏసీబీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు ఆగస్టు-20న గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది. కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్‌ సంస్థలపై నేరుగా సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుమతి ఇచ్చారు. అయితే.. కొన్ని షరతులు వర్తిస్తాయంటూ ఫిట్టింగ్ పెట్టింది ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అదే గెజిట్‌‌లో క్లియర్ కట్‌గా రాసుకొచ్చింది. జూలై-01 నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2018లో నారా చంద్రబాబు సీఎం ఉన్నప్పుడే ఏపీలోకి సీబీఐకి ఎంట్రీ లేదని సమ్మతి ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం జరిగింది. బాబు తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై నాడు పెద్ద ఎత్తునే విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు అనుచరులపై సీబీఐ దాడిచేస్తే ప్రజాస్వామ్యం దెబ్బ తిన్నట్టా..? అంటూ న్యాయ నిపుణులు, మేథావులు నాడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే.. ఇప్పుడు ఎందుకు మనసు మారిందో తెలియట్లేదు కానీ రాష్ట్రంలో సీబీఐ విచారణ పరిధిని కొనసాగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం 1946లోని.. సెక్షన్-03 ప్రకారం విచారణ పరిధి పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. ఇకపై సీబీఐ పరిధిలో నిర్ధేశించిన నేరాల విచారణ ఎంచక్కా దర్యాప్తు సంస్థ చేసుకోవచ్చన్న మాట. నాడు ఇదే చంద్రబాబు ఎందుకు వద్దనుకున్నారు..? ఇప్పుడు అదే చంద్రబాబు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే దానిపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది.గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కూటమి సర్కార్ విశ్వప్రయత్నాలే చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని కేసులను సీఐడీకి కూడా అప్పగించడం జరిగింది. అయితే ఇప్పుడు సీబీఐ రాష్ట్రంలోకి రావడానికి, నేరాల విచారణకు అనుమతి తామే ఇచ్చి.. అవినీతి కేసులను విచారించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామంతో వైసీపీ డేంజర్ బెల్స్ మోగినట్టేనని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు చెబుతున్న పరిస్థితి. వివేకా హత్య కేసుతో పాటు పలు కీలక కేసులు ప్రస్తుతం సీబీఐ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో  పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ పరుగులు పెట్టనున్నాయి. అయితే.. అబ్బే వైసీపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ఏదో గోల్ మాల్ అయితే జరుగుతోందనే అభిప్రాయాలు పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నాయ్. ఇకపై కొత్తగా ఎన్ని కేసులు నమోదవుతాయి..? ఎంత మంది వైసీపీ నేతలపై సీబీఐ విచారణ ఉంటుంది..? అనేది మున్ముంది చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: