ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఒకవైపు వేతనం క్రెడిట్ కాక తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియక వాళ్లు ఒకింత టెన్షన్ పడుతున్నారు. ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో గ్రామ, వార్డ్ వాలంటీర్లు ఉద్యమానికి సిద్ధమైనట్టు సమాచారం అందుతోంది. పెండింగ్ బకాయిలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన 10000 రూపాయలు గౌరవ వేతనం అందించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
 
ఈ నెల 27వ తేదీన ఏపీలో మంత్రివర్గ సమావేశం జరగనుండగా ఈ సమావేశంలో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని వాళ్లు కోరుతున్నారు. అలా జరగని పక్షంలో ఆగస్టు 31వ తేదీన విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ ప్రణాళికను రూపొందించాలని వాళ్లు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వాలంటీర్లు అలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.
 
రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లలో ఎక్కువమంది వైసీపీ వాళ్లే అనే అభిప్రాయం జనాల్లో, టీడీపీ నేతల్లో ఉంది. వాలంటీర్లకు అనుకూలంగా వ్యవహరించినా తమకు ఏ మాత్రం లాభం ఉండదని కూటమి భావిస్తోంది. మరోవైపు వాలంటీర్లుగా టీడీపీ కార్యకర్తలను నియమిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. రాబోయే రోజుల్లో అయినా గ్రామ వాలంటీర్ల పరిస్థితి మారుతుందేమో చూడాలి. వీళ్లకు న్యాయం జరగాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు.
 
వాలంటీర్లు వేతనాలు డబుల్ అవుతాయని కూటమికి ఓటు వేయగా అందుకు భిన్నంగా జరుగుతోందనే కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వాలంటీర్లు ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ప్రత్యామ్నాయ ఉద్యోగాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గ్రామ, వార్డ్ వాలంటీర్ల సేవలను ఏపీ ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకోనుందనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. ఏపీ వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం వేతనాలను అయినా చెల్లిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: