* జగన్ కు అత్యంత విధేయుడిగా ప్రవీణ్ ప్రకాష్

* పాఠశాల విద్యా శాఖ కార్యదర్శిగా గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు..

* ఆకస్మిక తనిఖీలతో ఉపాధ్యాయులను హడలెత్తించిన ప్రవీణ్ ప్రకాష్..

* ప్రవీణ్ ప్రకాష్ దూకుడు నిర్ణయాలే జగన్ కొంపముంచిందా..?



ప్రవీణ్ ప్రకాష్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కు ప్రవీణ్ ప్రకాష్ అత్యంత వీర విధేయుడు..సీనియర్ అండ్ సిన్సియర్ అధికారిగా ప్రవీణ్ ప్రకాష్ పేరు తెచ్చుకున్నారు.. అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో మాత్రం ఎన్నో విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యంగా విద్యాశాఖలో అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బందిని ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రవీణ్ ప్రకాష్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ప్రభుత్వంలో కీలకమైన పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ కు జగన్ బాధ్యతలు అప్పగించారు. అయితే గత ప్రభుత్వం విద్యాసంస్కరణలో భాగంగా విద్యా శాఖలో ఎన్నో మార్పులు చేసింది.. అయితే పూటకో జీవో, ఉత్తర్వులతో విద్యాశాఖ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.దీనికి తోడు విద్యా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మిక తనిఖీల పేరుతో ప్రతి నెల ఒక జిల్లాను సందర్శించి పాఠశాల ఉపాధ్యాయులను హడలెత్తించారు. కొంతమంది అధికారులపై ఆయన బదిలీ వేటు వేయడం అలాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం వంటివి చేసారు.. కనీసం విద్యాశాఖలో సీనియర్ అధికారుల మాటను కూడా ఆయన లెక్కచేయలేదు. ఆయన మాట వినని అధికారులను అప్పటికప్పుడు కఠిన చర్యలకు ఉపక్రమించేవారు.


అయితే ఇదంతా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చేశారన్న ఆరోపణలు కూడా ఆయన పై ఉన్నాయి. ముఖ్యంగా విద్యాశాఖలో అధికారులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ వ్యతిరేక వర్గాలుగా ఉన్నట్లు గుర్తించారు. దీనితో వారిపై ప్రవీణ్ ప్రకాష్ ద్వారా ప్రభుత్వం కక్ష సాధించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.అయితే అన్ని రోజులు ఒకేలా వుండవు అనే సామెత గుర్తుండే ఉంటుంది..ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీని చిత్తుగా  ఓడించి కూటమి అధికారంలోకి వచ్చింది.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురు కీలక అధికారులపై వేటు పడింది. అందులో ప్రవీణ్ ప్రకాష్ కూడా ఒకరు. గత ఐదేళ్లుగా ప్రవీణ్ ప్రకాష్ తీరుతో ఇబ్బంది పడిన బాధితులు ఒక్కొక్కరిగా బయటపడుతుందటంతో  ప్రవీణ్ ప్రకాష్ ఒక ప్రత్యేక వీడియోను కూడ విడుదల చేశారు.విద్యాశాఖ పురోగతి కోసమే కృషి చేశాను. నేను తనిఖీలతో ఉపాధ్యాయులు, సిబ్బందిని అవమానించలేదు. అభ్యసన సామర్ధ్యాలు పెంచేందుకే తాను అలా మాట్లాడాను అని ఎవర్ని అవమానించేందుకు అలా చేయలేదని ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. దయచేసి వాటిని మనసులో ఉంచుకోకండి అని వీడియోలో స్పష్టం చేశారు.

అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే ప్రవీణ్‌ ప్రకాష్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకున్నారు..దానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్‌ ప్రసాద్‌ గతంలోనే నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీఆర్‌ఎస్‌ సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.. ఇంకా ఏడేళ్ల సర్వీస్ ఉన్నా.. ఆయన జూన్‌ 25వ తేదీన వీఆర్‌ఎస్‌కు అర్జీ చేసుకోవడం.. కూటమి ప్రభుత్వం దానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం అంతా త్వరత్వరగా జరిగిపోయాయి.అయితే తాజాగా తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు..తనను మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా దరఖాస్తు చేశారు. తాను వీఆర్ఎస్ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నానని.. మానసిక ఒత్తిడి కారణంగా అలా చేశానని ఆయన తెలిపారు.అయితే, సర్వీసులోకి తిరిగి తీసుకునే విచక్షణాధికారం కేవలం సీఎంకి మాత్రమే ఉందంటూ  ప్రభుత్వ వర్గాలు తెలిపాయి... ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి తన ఆలోచనలను వివరించే ప్రయత్నంలో ప్రవీణ్ ప్రకాష్ ఉన్నట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రి ఆమోదిస్తే, ప్రవీణ్ ప్రకాష్ సర్వీసులోకి కొనసాగే అవకాశం ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: