- మూడు పార్టీలు... న‌లుగురు సీఎంల ద‌గ్గ‌ర మంత్రి
- సుదీర్ఘ‌కాలం మంత్రిగా ప‌నిచేసిన రికార్డ్‌
- స‌త్తుప‌ల్లి, ఖ‌మ్మం, పాలేరు మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎమ్మెల్యే

( ద‌క్షిణ తెలంగాణ - ఇండియా హెరాల్డ్ )

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, రాష్ట్ర స్థాయిలోనూ చక్రం తిప్పిన నేతల్లో తుమ్మల నాగేశ్వరరావు  ఒకరు. ఆయ‌న‌ది నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ ప్ర‌స్థానం. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా అభివృద్ధిలో తుమ్మ‌ల త‌న‌దైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ పిలుపు మేర‌కు రాకీయాల్లోకి తుమ్మ‌ల ఎంట్రీ ఇచ్చారు. మూడు వేరు వేరు పార్టీల నుంచి తుమ్మల గెలవడం విశేషం. అలాగు మూడు పార్టీల్లో న‌లుగురు సీఎంల ద‌గ్గ‌ర ఆయ‌న మంత్రి అవ్వ‌డం మ‌రో రికార్డ్‌.


1983 నుంచి 2004 వరకు సత్తుపల్లిలో, 2009, 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు మొత్తం ఎనిమిది సార్లు బరిలో నిలిచారు. సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999లో గెలిచిన ఆయ‌న 1983, 1989లో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ఖమ్మంలో గెలిచిన ఆయన 2014లో ఓడిపోయారు. అనంతరం బీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యారు. 2014లో పాలేరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందిన రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణించడంతో ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి బీఆర్ఎస్ నుంచి కూడా పాలేరులో ఎమ్మెల్యే అయ్యారు. ఆ త‌ర్వాత అదే పార్టీ నుంచి పోటీ చేసి 2018 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.


ఇక గ‌తేడాది ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ టిక్కెట్ ద‌క్క‌క కాంగ్రెస్ నుంచి ఖ‌మ్మంలో పోటీ చేసి గెలిచారు. తుమ్మ‌ల భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో జన్మించారు. డిగ్రీలో బీకామ్‌ పూర్తి చేశారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు 1978లో తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లోకి ప్రవేశించి 1983 ఎన్నికల్లో సత్తుపల్లి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓటమి పాలయ్యారు. మళ్లీ ఏడాదిన్నరకే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో గెలుపొందారు. ఎన్టీఆర్ హాయాంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1989లో ఓటమి పాలైన తుమ్మల, 1994 ఎన్నికల్లో మరోసారి సత్తుపల్లి నుంచి విజ‌యం సాధించారు.


అనంత‌రం ఆయ‌న చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. 1996 అగస్ట్ 20న చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి అయ్యారు. ఆ త‌ర్వాత 1996 డిసెంబర్‌లో భారీ నీటి పారుదల శాఖ బాధ్యతలు తీసుకున్నారు. 1999 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001లో రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా పదోన్నతి పొందారు. 2004 ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలైన తుమ్మల, అదే సంవత్సరంలో ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.


మూడు ప్ర‌భుత్వాలు.. న‌లుగురు సీఎంల ద‌గ్గ‌ర మంత్రి...
తుమ్మ‌ల తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మంత్రిగా ప‌నిచేశారు. అనంత‌రం బీఆర్ఎస్‌లోకి వెళ్లి కేసీఆర్ ప్ర‌భుత్వంలో మంత్రి అయ్యారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్లి రేవంత్ రెడ్డి ద‌గ్గ‌ర మంత్రిగా ఉన్నారు. ఇలా రెండు తెలుగు  రాష్ట్రాల్లో సుదీర్ఘ‌కాలం మంత్రిగా ప‌నిచేసిన రికార్డ్ కూడా ఆయ‌న‌కే సొంత‌మైంది. స‌త్తుప‌ల్లి, పాలేరు, ఖ‌మ్మం నుంచి కూడా ఆయ‌న ఎమ్మెల్యే అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: