దీంతో రాజకీయంగా, వ్యక్తిగతంగా అవినాష్ ను చిక్కులు చుట్టూముట్టాయనే చర్చ జరుగుతోంది. అయినా ఇవన్నీ అవినాష్ స్వయంకృతాపరాధమేనన్న వాదనలు బలంగా వినిపిస్తోంది. దేవినేని అనే బ్రాండ్ ఉండి కూడా... అనాలోచిత నిర్ణయాల కారణంగానే పరిస్థితి ఇలా తయారయిందని అవినాష్ అనుచరులే అనుకుంటున్నారట. దీనికి కారణం లేకపోలేదు మరి. పోటీ చేసిన ప్రతిసారి ఓటమి తప్ప గెలుపు తలుపు తట్టలేదు అవినాష్ కు. తప్పటడుగులో కాలం కలిసి రాలేదు. కారణం ఏదైనప్పటికీ వరుసగా ఓటమి పాలవుతూనే ఉన్నారు. మూడు పర్యాయాలు మూడు చోట్ల పోటీ చేసినప్పటికీ ఫలితం అనుకూలంగా రాలేదు.
ఫాలోయింగ్ మాత్రం చాలానే ఉంది. కానీ వరుస ఓటములు పలకరిస్తూ ఉండడం దేవినేని అనుచరులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దేవినేని రాజశేఖర్ అలియాస్ నెహ్రూ వారసుడిగా 2013లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా స్టేట్ స్టూడెంట్ జేఏసీ లీడర్ గా పనిచేశాడు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతల సూచనలతో 2014లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ కు విభజన సేగ గట్టిగా తగలబోతుందని గుర్తించడంలో విఫలమైన అవినాష్ ఆ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు.
అలా మొదటిసారి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తండ్రి నెహ్రూతో కలిసి టీడీపీలో చేరిన అవినాష్ 2019లో చంద్రబాబు సారథ్యంలో గుడివాడలో నానిపై టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇలా రెండోసారి ఓటమిపాలు అయ్యారు. 2019లో వైసీపీకి అధికారం దక్కడంతో ఈసారి అటువైపుకు వెళ్ళాడు. జగన్ ఆదేశాలతో విజయవాడలో తూర్పు నియోజకవర్గంపై దృష్టి పెట్టి గట్టిగానే పనిచేశారు. ఎమ్మెల్యే కాకపోయినా ఆ స్థాయిలో అభివృద్ధి పనులు చేయించాడనే పేరు ఉంది. కానీ 2024 ఎన్నికల్లో అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి తప్పలేదు. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవిని కాదని తనకు జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు అవినాష్. వరుస ఓటములతో దేవినేని అవినాష్ రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతోందని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.