నరేంద్ర మోదీ వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అందరూ ఊహించిన విధంగానే మోదీకి కుడిభుజం అయిన అమిత్‌ షా తిరిగి భారత హోం  శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లోను ఆయన ఇదే శాఖను నిర్వహించారు. ఈ పదవిలో ఆయన ఉండటం వల్ల దేశ భద్రతకు సంబంధించిన చాలా సున్నిత అంశాలను ఆయన వేగంగా పరిష్కరించగలరు.


నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 2026లో మార్చి నాటికి నక్సల్స్ హింస నుంచి దేశానికి విముక్తి కలిగిస్తుందని కేంద్ర హొం మంత్రి అమిత్‌ షా అన్నారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాదంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందని అన్నారు. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పుర్ లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ పై జరిపిన కీలక భద్రతా సమావేశానంతరం మీడియాలో అమిత్‌ షా మాట్లాడారు.


దేశ ప్రజా స్వామిక వ్యవస్థకు నక్సలిజం అతిపెద్ద సవాల్ అని తాను నమ్ముతున్నామని.. గత నాలుగు దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా 17000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సలిజం సవాళ్లని సమర్థంగా ఎదుర్కొన్నామని, ఆయుధాలు పట్టుకున్న వారిని జాతీయ స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేశామని చెప్పారు.



2026 నాటికి దేశంలో మావోయిస్టులు కనుమరుగు అవుతారని అన్నారు. ఛత్తీస్ గఢ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 189 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో చనిపోయారని వెల్లడించారు. ఇదే సమయంలో లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ రాష్ట్రాల్లో పోలీసులకు అధునాతన ఆయుధాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. హింసను వీడాలని కోరారు.  రాయ్ పుర్ లో ఏర్పాటు చేసిన కీలక భద్రతా సమావేశంలో పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: