- పార్టీలు మారిన ఫలితాలు మాత్రం మారలే.
- రాజకీయ అవసరాల కోసం కార్యకర్తలపై దెబ్బ.!
ప్రస్తుత కాలంలో చాలామంది పొలిటీషియన్స్ వారి పదవిని, పరపతిని కాపాడుకోవడం కోసం ఎలాంటి పనులైన చేయడానికి వెనకాడటం లేదు. ముఖ్యంగా పార్టీలు మారుతూ పరపతిని కాపాడుకుంటూ ఏ పార్టీలోకి వెళ్లిన పదవులు పొందే నేతల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఒకరు. ఈ విధంగా పార్టీలు మారుతూ తనను నమ్ముకుని ఉన్నటువంటి ఎంతో మంది కార్యకర్తల చెవిలో పువ్వులు పెట్టి, విలాసాల అనుభవిస్తున్న వారిలో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఒకరని చెప్పుకోవచ్చు. అలాంటి ఎర్రబెల్లి ఏ పార్టీలో చేరారు, ఏ ఏ పదవులు అలంకరించారు అనే వివరాలు చూద్దాం..
పార్టీల మార్పే కలిసొచ్చేనా?
తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఈ నేత, ఆ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఉద్యమ పార్టీ ద్వారా తన మంత్రి కల నెరవేర్చుకున్న క్రియాశీలక రాజకీయ నాయకుడు ఎర్రబెల్లి. 1956 జూలై 4న వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామంలో ఎర్రబెల్లి జగన్నాధరావు ఆదిలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఈయన మొదటిసారి 1982లో రాజకీయాల్లో చేశారు. 1983 సాధారణ ఎన్నికల్లో మొదటిసారి టిడిపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన 1994, 1999, 2004 ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పటినుంచి పాలకుర్తి నియోజకవర్గం నుంచి 2009, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా చేశారు. మొదట్లో ఎన్టీఆర్ పార్టీలో చేరినప్పుడు 20,000 మందితో వరంగల్లో సభ పెట్టి ఎన్టీఆర్ దృష్టిలో పడ్డారు.