తెలంగాణ కాంగ్రెస్ లో రాష్ట్ర కేబినెట్ లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పదవుల భర్తీపై కసరత్తు ఓ కొలిక్కి వస్తుందట. పీసీసీ అధ్యక్ష పదవికి ప్రస్తుతం రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ గౌడ్ వైపే సీనియర్స్ అంతా మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. అధికారికంగా ప్రకటించకుండా ఆయన పేరు దాదాపు ఖరారు అయినట్లే అంటున్నాయి పార్టీ వర్గాలు. మరోవైపు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి కూడా పిసిసి చీఫ్ పదవిపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. ఏఐసీసీ పెద్దలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారాయన. ఫైనల్ గా పేరు ఎవరిదైనా ఒకటి రెండు రోజుల్లోనే మ్యాటర్ మొత్తం తేలిపోయి....అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.


అదే ఊపులో వర్కింగ్ ప్రెసిడెంట్ ను కూడా నియమిస్తారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అలా పార్టీ పరంగా సంస్థాగత నిర్మాణం పూర్తయితే వెంటనే కేబినెట్లో ఉన్న ఖాళీలపై దృష్టి పెట్టచ్చని అంటున్నాయి తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు. మంత్రివర్గంలోకి ఇంకో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉంది. అయితే అందులో ఓ రెండు ఖాళీలను అలాగే వదిలేసి.... శ్రావణమాసం ముగిసేలోపు కొత్తగా నలుగురిని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆ విషయంలో సీఎం, ఏఐసీసీ పెద్దల ఆలోచన ఒకేలా ఉందన్నది పార్టీలో నడుస్తున్న ఇంటర్నల్ టాక్. అంటే అతి త్వరలోనే కేబినెట్ విస్తరణ కూడా ఉంటుందన్నమాట.


దీంతో ఆ నలుగురు లక్కీ లీడర్స్ ఎవరన్న చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాలు పార్టీకి కలిసి వచ్చే అంశాలు అన్నింటిని పరిగణలోకి తీసుకున్నాకే నాలుగు పోస్టుల భర్తీ ఉంటుందంటున్నారు. మంత్రివర్గంలో ప్రస్తుతం అదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకే ప్రాధాన్యత ఉండొచ్చని అంచనా వేస్తూ ఆయా జిల్లాల నుంచి రేసులో ఎవరెవరు ఉంటారన్న చర్చ జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇటు హైదరాబాద్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని అనుకుంటున్నారట అధిష్టానం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి కేబినెట్ బెర్తు దాదాపు ఖరారు అయినట్టేనని చర్చ జరుగుతోంది.

అదే సమయంలో పీసీసీ సామాజిక వర్గం నుంచి ముదిరాజ్ లకు మంత్రి పదవి ఇస్తామని లోక్సభ ఎన్నికలకు ముందు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు అనుగుణంగా ఆ సామాజిక వర్గ నేతలను మంత్రి పదవి వరించే అవకాశం లేకపోలేదు. అంటున్నారు. ఆ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శ్రీహరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఆ సామాజిక వర్గం మొత్తం పార్టీతో నడవాలంటే ముదిరాజ్ సంఘంలో పేరు ఉన్న నాయకుడికి పదవి ఇస్తే బాగుంటుందన్న ఆలోచన కాంగ్రెస్ పెద్దల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: