నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.90 రోజుల్లో 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని, మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నామని ఆయన ప్రకటించారు. సరైన సమయంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇక విద్యార్థులు, కంపెనీల మధ్య గ్యాప్ వస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు తాము నియామకాలు చేపడితే వాయిదా వేయాలని అంటున్నారని విపక్ష బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. వాళ్ల ఉద్యోగాలు పోయాకే నిరుద్యోగులు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూశారని మండిపడ్డారు. 90 రోజుల్లో 30 వేల మందికి నియామక పత్రాలు అందించామని ప్రస్తావించారు. దుక్కల్లాగా ఉన్న బావ, బామర్థులు నిరుద్యోగ యువత కోసం అమరణ నిరాహారదీక్ష చేయాలని రేవంత్ విమర్శించారు.‘‘మా ప్రభుత్వం కష్టపడి చదువుతున్న విద్యార్థుల కోసం పని చేస్తోంది. పదేళ్లలో అధికారం కోసం పని చేసి ఇవాళ వాళ్లు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయారు. మా కోసం మేము పని చేయము. మా కర్తవ్యం తెలంగాణ సమాజం కోసం కష్టపడి చేయడం’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

సెక్రెటరీయేట్‌లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ సాయాన్ని అందజేశారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన 135 మందికి రూ.1 లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.గత ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటో పదేళ్లు కళ్లారా చూశామని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఉద్యమం వల్లే రాష్ట్ర సాధన సాధ్యమైందని, నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్‌ సర్వెంట్లు కావాలని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. సివిల్స్‌ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని, మెయిన్స్‌లో ఉత్తీర్ణులైతే మళ్లీ ఆర్థికసాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని నిరుద్యోగులకు త్వరలోనే మరో 35 వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగులకు తాను అన్నగా తోడుంటానని హామీ ఇచ్చారు. సివిల్స్ మెయిన్స్ లో ఉత్తీర్ణులు అయితే మరోసారి ఆర్థిక సాయం చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. పరీక్షలు వాయిదా వేస్తే నిరుద్యోగులకే ఇబ్బంది అని కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని రేవంత్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: