- ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ టోటల్ ఖాళీ
- ( గోదావరి - ఇండియా హెరాల్డ్ ) .
ఆంధ్రప్రదేశ్లో ఒక్కో నియోజకవర్గంలో వైసిపికి దిమ్మతిరిగే షాక్ లు తగులుతున్నాయి. పార్టీ అసలు ఇప్పట్లో అధికారంలోకి రాదని భావిస్తున్న కీలక నేతలు సైతం పార్టీని వదిలి బయటకు వచ్చేస్తున్నారు. వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ... మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని కొద్ది రోజుల క్రితం పార్టీలో తన అన్ని పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆళ్ళ నాని ఏలూరు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే .. ప్రస్తుత ఏలూరు వైసిపి ఇన్చార్జి ... అలాగే ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేసి వారం రోజులు కూడా కాలేదు .. వెంటనే నియోజకవర్గంలో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి దిమ్మతిరిగే షాక్‌లు తగులుతున్నాయి.
ఇప్పటికే ఏలూరు నియోజకవర్గంలో ద్వితీయశ్రేణి నాయకులు కీలక నేతలు అందరూ తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ ... ఆమె భర్త ఎస్ ఎం ఆర్ పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలో చేరేందుకు రెడీ అవుతున్నారు. వాస్తవానికి ఈ విషయం ఆళ్ల నానికి ముందే తెలుసు అని అంటున్నారు. అన్నీ తెలిసిన తర్వాతే వారిని ఆపటం తన వల్ల కాదని నిర్ణయించుకున్న తర్వాత ఆళ్ళ నాని పార్టీకి రాజకీయాలకు కూడా దూరమయ్యారని అంటున్నారు. ఇంకా ఏలూరు నగరంలో పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే వైసీపీని వీడీ తెలుగుదేశం - జనసేనలో చేరేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు కేలక నేతలు ఇప్పటికే పార్టీ మారిపోయారు.
అలాగే ఏలూరు నగరానికి చెందిన 40 మంది వైసీపీ ద్వితీయ శ్రేణి కీలక నేతలు సైతం టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా ఏలూరు నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీకి నియోజకవర్గస్థాయి నాయకుడు కాదు కదా ... కనీసం ద్వితీయ శ్రేణిలో కూడా చెప్పుకోదగ్గ లీడర్ కూడా లేని పరిస్థితి.