హైడ్రా దూకుడు నేపథ్యంలో ప్రతిపక్షాల నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. అధికార పార్టీ నాయకులను మినహాయించి.. కేవలం ప్రతిపక్ష పార్టీల నాయకులకు చెందిన భవనాలను మాత్రమే కూల్చి వేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే అధికార పార్టీ నాయకులు అక్రమంగా నిర్మించిన భవనాలను కూడా కూలగొట్టాలని సవాల్ విసురుతున్నారు.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షం భారాస అనుకూల మీడియా హైడ్రా పనితీరును తప్పు పడుతోంది. ఇటీవల సినీ హీరో నాగార్జున కు చెందని ఎన్ కన్వెన్షన్ కూలగొట్టడం సరికాదని వ్యాఖ్యానిస్తోంది. ఇలాంటి చర్యల వల్ల సినీ పరిశ్రమ హైదరాబాద్ వదిలి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయే ప్రమాదం ఉందని లేనిపోని ప్రచారం చేస్తోంది. అయితే ఇవి సహజంగానే హైడ్రాకు ఇబ్బందికర పరిణామం.
హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించి పలువురు రాజకీయ నాయకులు కట్టడాలు నిర్మించారు. ఈ జాబితాలో మాజీ మంత్రి మల్లా రెడ్డి, ఎంఐఎం నేత ఓవైసీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే ఏకంగా మల్లారెడ్డి, ఓవైసీ అక్రమ కట్టడాల వివరాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. దీంతో ఇవి వైరల్ అయ్యాయి.
ఈ విషయాన్ని కొంత మంది విలేకరులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. హైడ్రా అనేది రాజకీయ చదరంగంలో పావు కాదని తేల్చి చెప్పారు. మల్లారెడ్డి, ఓవైసీ లకు చెందిన కాలేజీల్లో చాలా మంది విద్యార్థులు చదువుతున్నారు. వారి భవిష్యత్తు పాడవకూడదు. అందుకే ఆయా కళాశాల యాజమాన్యాలకు కొంత సమయం ఇస్తున్నాం అని వివరించారు.
ఈ తర్వాత మేం చెప్పిన చర్యలు వారు తీసుకోకపోతే మేం రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. అప్పుడు పార్టీలకు అతీతంగా చర్యలు ఉంటాయి అని స్పష్టం చేశారు. ఒకవేళ ఎఫ్ టీ ఎల్ పరధిలో ఏదైనా ధార్మిక క్షేత్రం ఉన్నా దానిని పడగొడతాం అని వివరించారు. నగరంలో ఉన్న చెరువులు, పార్కులు కబ్జా కాకుండా కాపాడుతాం అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదు దారులు బారులు తీరుతున్నారు. పోలీసులు కూడా కార్యాలయానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.