జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన సమయంలో కుటుంబం నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ లభించింది. జగనన్న వదిలిన బాణం అంటూ అప్పట్లో షర్మిళ చేసిన ప్రచారాన్ని ఎవరూ మరిచిపోలేరు. వైసీపీ నిలబడటంలో, కార్యకర్తలకు అండగా నిలవడంలో అప్పట్లో షర్మిళ కీలక పాత్ర పోషించారు. అయితే 2024 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి షర్మిళ జగన్ కు వరుస షాకులిచ్చారు.
ఆస్తుల పంపకంలో జగన్, షర్మిళ మధ్య విబేధాలు వచ్చాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు విజయమ్మ సైతం పలు సందర్భాల్లో షర్మిళకు సపోర్ట్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. సొంత కుటుంబ సభ్యులను జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని టీడీపీ నేతలు ఇప్పటికీ విమర్శలు చేస్తూ ఉంటారు. 2013 సెప్టెంబరు 23న బెయిల్ మీద బయటకు వచ్చిన జగన్ ఇప్పటికీ బెయిల్ పై ఉన్నారనే సంగతి తెలిసిందే.
జగన్ తగిన ప్రాధాన్యత ఇచ్చి ఉంటే తల్లి, చెల్లి దూరంగా ఉండేవారు కాదని జగన్ కు ఇప్పటికీ సపోర్ట్ చేసేవారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తల్లి, చెల్లి విషయంలో ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా జగన్ తీరు ఉందనే విమర్శలు సైతం ఉన్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిని, చెల్లిని జగన్ పక్కన పెట్టేశారని చాలామంది భావిస్తారు. ఈ కామెంట్ల విషయంలో జగన్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.