వద్దు జగన్.. ఉండొద్దు జగన్.. ఇది సీఎం చంద్రబాబు సకి కొత్తగా ఎంచుకున్న స్లోగన్. జగన్ సీఎంగా వద్దు అని మొన్నటి వరకు అన్నారు. ప్రతిపక్ష నేతగా వద్దు అని ప్రజలు అన్నారని తీర్పు ఇచ్చారు. నేడు జగన్ కనీసం ఎమ్మెల్యేగా కూడా పనికిరారు అని అంటున్నారు చంద్రబాబు. ఇంకాస్త ముందుకు వెళ్లి అసలు జగన్ లాంటి వ్యక్తులు అసలు సమాజంలో లేకుంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని హాట్ కామెంట్ చేశారు చంద్రబాబు.
పోలవరానికి కేంద్రం నిధులు ఇచ్చిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు చంద్రబాబు. పనిలో పనిగా వైసీపీపై పలు విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేతపై తీవ్ర విమర్శలే చేశారు. జగన్ వల్లే పోలవరం పూర్తి కాలేదని నిప్పులు చెరిగారు. వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్లు పోలవరం పడకేసింది అని ఆయన అన్నారు.
పోలవరాన్ని జగన ఏమాత్రం పట్టించుకోలేదని.. అందుకే 2021 నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు కాస్తా ఈ రోజుకి ఏమీ కాకుండా ఉండిపోయిందని అని అన్నారు. కేంద్రం పోలవరానికి ఎనిమిది వేల కోట్లు వైసీపీ హయాంలో ఇస్తే అందులో నాలుగు వేట్ల కోట్లనే ఖర్చు పెట్టారని.. పనులు కూడా నాసిరకంగా చేపట్టారని విమర్శించారు. మిగిలిన నాలుగు వేల కోట్లను కూడా ఇతర అవసరాలకు నిధులు మళ్లించారని పేర్కొన్నారు.
జగన్ పాలన వల్లే దిల్లీలో అధికారులు కూడా తలెత్తుకొని తిరగలేకపోతున్నారన్నారు. జగన్ అసలు రాజకీయ పార్టీని నడపడానికి కూడా అర్హుడు కాదన్నారు. గతంలో బూతులు వినిపించేవి అని ఇప్పుడు ఎవరైనా ఎక్కడ అయినా వింటున్నారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని అందరూ ప్రశాంతంగా ఉంటున్నారని అన్నారు. ఇక పోలవరం విషయంలో వైఎస్సార్ హయాంలో కాలువలే తవ్వారని.. రోశయ్య ఏమీ చేయలేదని.. కిరణ్ కుమార్ రెడ్డి టెండర్లు పిలిచారని తాను వచ్చాకే అసలు పనులు మొదలయ్యాయి అని వివరించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 72 శాతం పనులు పూర్తి చేశానని.. ఇప్పుడు కూడా పోలవరం పూర్తి చేసే బాధ్యత తనపై ఉందని మూడేళ్ల కాలపరిమితితో దానిని కంప్లీట్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.