- అధికారం ఎక్కడ ఉంటే కేకే అక్కడే..
- కేసీఆర్ నమ్మిన బంటుగా ఉంటూ వెన్నుపోటు..
కే కేశవరావు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో ఈయన కూడా ఒకరు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కేశవరావు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ చెంతన చేరారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయితే నెంబర్ -2 నేతగా కే కేశవరావు ఉండేవారు. కెసిఆర్ దగ్గర ఎలాంటి పని కావాలన్నా కేశవరావును కలవాల్సిందే. ఆ విధంగా బీఆర్ఎస్ లో కూడా కీలకమైన నేతగా మారినటువంటి కేశవరావు చివరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ కు హ్యాండ్ ఇచ్చారు.. నా పార్టీ కాంగ్రెస్సే అని కాంగ్రెస్ నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని అంటున్నారు. ఇదే తరుణంలో కేసీఆర్ పార్టీని కూడా నిందించడం లేదు. కెసిఆర్ అంటే నాకు ఎంతో ఇష్టమని, చెబుతూ వస్తున్నారు. అలాంటి కేశవరావు యొక్క రాజకీయ నేపథ్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..
కేసీఆర్ నమ్మిన బంటుగా:
దాదాపు 55 ఏళ్ల పాటు రాజకీయంగా ఎంతో ఎదిగిన కేశవరావు ఎన్నో పదవులు అలంకరించారు. ముఖ్యంగా తన రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దుకున్నది కాంగ్రెస్ పార్టీలో అని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. అలాంటి కేశవరావు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చెంతన చేరారు. సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేశారు. బీఆర్ఎస్ తరఫున ఢిల్లీలో ఎలాంటి పనులు చేయాలన్నా కేశవరావు ముందు ఉండాల్సిందే. అలా కెసిఆర్ తర్వాత నెంబర్ టు నేతగా ఎదిగిన కేశవరావును కెసిఆర్ కూడా ఎంతో నమ్మారు. అంతేకాకుండా కేశవరావు ఏదైనా చెప్పాడు అంటే అది కేసిఆర్ మాటగానే చెప్పుకునేవారు. కెసిఆర్ కు ఎంతో దగ్గరైన కేశవరావు చివరికి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన ఈ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం కూడా తన కూతురే. తన కూతురు రాజకీయ భవిష్యత్తు సెట్ చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది.
రాజకీయ ప్రస్థానం:
ఇక కేశవరావు రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే..దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అలా సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్లో పనిచేసిన ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కెసిఆర్ చెంతన చేరి పార్టీ సెక్రటరీ జనరల్ గా కూడా పనిచేశారు. ఇక 2014లో రాజ్యసభ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2020లో మళ్లీ ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెట్టారు. ఈ విధంగా 55 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అలంకరించిన కేశవరావు జూలై 23,2024వ తేదీన న్యూఢిల్లీలో అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిపోయాడు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు( ప్రజా వ్యవహారాలు) గా నియమించారు. అంతేకాదు జూలై 4వ తేదీన ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు. అయితే కేశవరావు ప్రధానంగా పార్టీ మారడానికి కారణం తన కూతురు రాజకీయ భవిష్యత్తు అని తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ మేయర్ గా ఉన్నటువంటి కూతురు గద్వాల విజయలక్ష్మి, తన తండ్రి కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో చేరింది. దీంతో కేశవరావు కూడా మరోసారి మేయర్ పదవి బిడ్డకు ఇప్పించాలని బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.